ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి వద్ద నిర్మిస్తున్న మార్కెట్ యార్డు పనులను శనివారం రైతులు అడ్డుకున్నారు. తమకు హామీ ఇచ్చినట్లుగా 250 గజాల ఇంటి స్థలాలు కేటాయించిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ అనే రైతు ఒంటిపై పెట్రోల్ చల్లుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుత మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు ఉండటంతో రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న మూడు సర్వే నంబర్లలో 94 మంది రైతుల నుంచి 86 ఎకరాల భూమిని సేకరించి కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
భూమి ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ.8.50 లక్షల పరిహారం ఇచ్చి 250 గజాల ఓపెన్ ప్లాట్ ఇవ్వాలని నిర్ణయించారు. రెండేళ్లు గడిచినా ప్లాట్ల కేటాయింపు జరగలేదు. శనివారం అధికారులు భూమి చదును పనులు ప్రారంభించగా భూములు కోల్పోయిన రైతులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు.
సమాచారం అందుకున్న గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎస్సై రఘుపతి సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేసి మర్కుక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంటి స్థలాలు కేటాయించే వరకు తమ ఆందోళన కొనసాగుతందని రైతులు తేల్చి చెప్పారు.
