V6 News

ఖాకీలే దొంగలయ్యారు.. విచారణ పేరుతో ఇంట్లోకి చొరబడి..గోల్డ్ ఎత్తుకెళ్లిన పోలీసులు

ఖాకీలే దొంగలయ్యారు.. విచారణ పేరుతో ఇంట్లోకి చొరబడి..గోల్డ్ ఎత్తుకెళ్లిన పోలీసులు
  • ఇండోర్‌‌‌‌‌‌‌‌లో ఘటన..ఐదుగురుపై వేటు

ఇండోర్: మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఇండోర్‌‌‌‌‌‌‌‌లో పోలీసులు బరి తెగించారు. విచారణ పేరుతో ఒకరి ఇంట్లోకి చొరబడి యజమానులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 1న అర్ధరాత్రి ఈ దారుణం జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. డీసీపీ కుమార్ ప్రతీక్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. 

రిటైర్డ్ ఏసీపీ రాకేశ్ గుప్తాతో ఉన్న ఆర్థిక వివాదంలో గౌరవ్ జైన్ అనే వ్యక్తిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. దీంతో వారెంట్ అమలు చేసేందుకు ఐదారుగురు పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. అయితే, వారు నిబంధనలకు విరుద్ధంగా బాధితుడి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. 

ఈ క్రమంలోనే ఇంట్లోని వారితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో వారిపై కేసును నమోదు చేసి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.