కొత్త మలుపులు తిరుగుతున్న శంషాబాద్లోని 50 ఎకరాల భూవివాదం

కొత్త మలుపులు తిరుగుతున్న శంషాబాద్లోని 50 ఎకరాల భూవివాదం
  •     శంషాబాద్​ ల్యాండ్స్​ కేసులో హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
  •     పిటిషనర్లు చెబుతున్నది అవాస్తవమని సీల్డ్​ కవర్​ అందజేత

హైదరాబాద్, వెలుగు :  శంషాబాద్‌‌‌‌లోని సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన 50 ఎకరాల భూవివాదం కొత్త మలుపులు తిరుగుతున్నది. తమకు చెందిన భూముల్లో జోక్యం చేసుకోరాదని 1997లో దాఖలైన రెండు పిటిషన్లల్లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందంటూ ఇద్దరు పిటిషనర్లు ఇప్పటి దాకా చెబుతున్నది వాస్తవం కాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. దీనిపై విచారణ చేసి హైకోర్టు రిజిస్ట్రీకి సీల్డ్‌‌‌‌ కవర్‌‌‌‌లో రిపోర్టు ఇచ్చింది. శుక్రవారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ శ్రవణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ల బెంచ్‌‌‌‌ విచారణ చేపట్టింది. తమ పూర్వీకులు శంషాబాద్​లో 50 ఎకరాలు కొన్నారని, అవి మావేనంటూ హైదరాబాద్​కు చెందిన మహ్మద్‌‌‌‌ యహియా ఖురేషి, మహ్మద్‌‌‌‌ మొయినుద్దీన్‌‌‌‌లు 1997లో వేర్వేరు పిటిషన్లు వేశారు.

ఆ భూముల్లో అధికారులు జోక్యం చేసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని చెబుతూ వచ్చారు. 1997 నాటి ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి ఇద్దరు పిటిషనర్లు సింగిల్‌‌‌‌ జడ్జి వద్ద స్టేటస్‌‌‌‌కో ఆర్డర్‌‌‌‌ కూడా పొందారు. ఇద్దరు పిటిషనర్లు తమకు శంషాబాద్‌‌‌‌లో ఇల్లు ఉందంటూ ఇంటి పన్ను, కరెంట్‌‌‌‌ బిల్లుల రశీదుల్ని హైకోర్టుకు సమర్పించారు. వాటిపై అభ్యంతరం తెలిపిన ఏజీ బీఎస్​ప్రసాద్​ 2007 నాటికి ఉమ్మడి ఏపీలోనే శంషాబాద్‌‌‌‌ ఉందని, అయితే, రశీదుల్లో 2007, తెలంగాణ స్టేట్, శంషాబాద్‌‌‌‌ విలేజ్‌‌‌‌ అని సమర్పించారని, అవి బోగస్‌‌‌‌ రశీదులని కోర్టుకు చెప్పారు. 1997లో రిట్లు, ఆర్డర్‌‌‌‌ ఉనికిలో లేవని కూడా చెప్పారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌‌‌‌ 13కి వాయిదా వేసింది.