సబ్బుల ధరలు మళ్లీ పెంచిన HUL

 సబ్బుల ధరలు మళ్లీ పెంచిన HUL
  • 3.5 శాతం నుంచి 14 శాతం వరకు ధరలు పెంచేసిన హిందుస్తాన్ యూనీ లీవర్
  • చిన్న ప్యాకెట్ల ధర పెంచలేదు కానీ.. బరువు తగ్గించింది

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా విడతల వారీగా ధరలు పెంచుతూ వస్తున్న హిందుస్థాన్‌ యూనీ లీవర్‌ తన ఉత్పత్తుల ధరలను మరోసారి  పెంచింది. తాజాగా పెంపుదల 3.5 శాతం నుంచి 14 శాతం వరకు ఉందని, ముడి వస్తువుల ధరలు పెరిగినందునే తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. నిరుపేద, మధ్య తరగతి ప్రజలు వాడే చిన్న ప్యాకెట్ల వస్తువుల ధరలను పెంచలేదు కాని... ప్యాకెట్ల బరువును తగ్గించి పరోక్షంగా భారం వేసింది. డిటర్జెంట్ పౌడర్‌ వీల్ ధరను 3.5 శాతం పెంచడంతో కిలో, అరకిలో ప్యాక్‌ ధర రూ. 1 నుంచి రూ. 2 దాకా పెరిగింది. అలాగే సర్ఫ్‌ ఎక్సెల్‌ (ఈజీ వాష్‌ వేరియంట్‌) ధర కూడా 100 రూపాయల నుంచి 114 వరకు పెంచేసింది. అలాగే రిన్‌ పౌడర్‌ కిలో ధర రూ.77 నుంచి రూ. 82లకు పెరగ్గా, అరకిలో ప్యాక్‌ ధర రూ. 37 నుంచి రూ. 40కి పెంచినట్లు ప్రకటించింది. 
సామాన్యుల పాలిటి సినిమా తారలు వాడే సబ్బు అనే అభిమానం చూరగొన్న లక్స్‌ సబ్బుల ధర కూడా 8 నుంచి 12 శాతం, నిరుపేదలు, సమాన్యుల స్నానపు సబ్బు లైఫ్‌బాయ్‌ సబ్సు ధర కూడా 8 శాతం పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. మార్కెట ధరల మేరకు దాదాపు అన్ని రకాల ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వచ్చినట్లు హిందుస్తాన్ యూనీ లీవర్ తెలిపింది.