నాన్ స్టాప్ ముసురు ట్రాఫిక్ జామ్తో జనం ఇబ్బందులు

నాన్ స్టాప్ ముసురు  ట్రాఫిక్ జామ్తో జనం ఇబ్బందులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ముసురు కొనసాగుతోంది. రెండురోజులుపాటు భారీ వర్షాలు కురవగా, బుధవారం నుంచి ముసురు నాన్ స్టాప్​గా పడుతోంది. గురువారం నగరమంతటా ఇదే పరిస్థితి ఏర్పడింది. ముషీరాబాద్ లో అత్యధికంగా 1.80 సెంటిమీటర్లు కురవగా, హిమాయత్ నగర్ లో 1.60, ఉప్పల్ లో 1.50, అంబర్ పేట్ లో 1.48 సెం.మీ. పడింది. ముసురుతో ట్రాఫిక్ మూవ్ మెంట్ స్లోగా సాగింది. ఉదయం, సాయంత్రం  ఆఫీసులు, స్కూల్స్ కి వెళ్లే వారు, తిరిగి వచ్చేవారికి  ఇబ్బందులు తప్పలేదు.  హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కోఠి, దిల్ సుఖ్​నగర్, చార్మినార్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, లక్డికాపూల్,  ఉప్పల్ ఇలా అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. 

వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా స్టాటిక్ టీమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల వద్ద నీరు చేరకుండా వర్షపునీరు వెళ్లే గ్రిల్స్ ని క్లీనింగ్ చేస్తున్నారు. నగరంలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్  ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చిన వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అత్యవరస సమయంలో ప్రజలు 040--29555500, 040--21111111 లేదా 9000113667 నంబర్లను  సంప్రదించాలని మేయర్ సూచించారు. 

హుస్సేన్ సాగర్ కు వరద....

వర్షాలకు హుస్సేన్ సాగర్ కు వరద పెరిగింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది.  భారీగా వరదనీరు చేరుతుంది. హుస్సేన్ సాగర్ లోకి వస్తున్న వరద పరిస్థితిని జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు 24 గంటలపాటు పరిశీలిస్తున్నారు. సాగర్ ఎఫ్ టిఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. గురువారం సాయంత్రానికి  నీటిమట్టం 513.18  మీటర్లకు చేరింది. వర్షాలు గనుక మరింత కురిస్తే హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల వారికిహెచ్చరికలు జారీ చేసే అవకాశముంది.  

నిండుతున్న జంట జలాశయాలు

జంట జలాశయాలైన ఉస్మాన్​సాగర్​, హిమాయత్​ సాగర్​కు భారీఎత్తున వరద వచ్చి చేరుతోంది. ఉస్మాన్​సాగర్​ఫుల్ ట్యాంక్​ లెవెల్​​1790 అడుగులు(3.900 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1783 అడుగుల(2.474 టీఎంసీ)కు చేరింది. ప్రస్తుతం 100 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉంది. హిమాయత్​ సాగర్​ ఫుల్​ట్యాంక్​ లెవల్​ 1763.50 అడుగులు(2.970 టీఎంసీ) కాగా, ప్రస్తుతం 1761.05 అడుగుల (2.447 టీఎంసీ) నీరుంది. 

ఈ జలాశయంలోకి ప్రస్తుతం 300 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉంది. మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిస్తే గేట్లు ఓపెన్​చేస్తామని అధికారులు అంటున్నారు. వరద ఎక్కువైతే సహాయక చర్యలు చేపట్టేందుకు నయాపూల్​వద్ద అధికారులు గురువారం మాక్​డ్రైవ్​నిర్వహించారు. హైడ్రా కమిషనర్​రంగనాథ్​గురువారం హిమాయత్​సాగర్​ను విజిట్​చేశారు.