- జాగ్రత్తగా ఉండాలన్న వైద్యారోగ్య శాఖ
- గరిష్టంగా 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- వడదెబ్బ తగిలితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ మంటకు తోడు ఉక్కపోత తీవ్రంగా ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ వరకు ఎండ మంట, ఉక్కపోత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది. తాజాగా మూడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 45.3 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా కొల్లూరులో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో 44.6 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 44.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఐదు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా, ఆరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, హైదరాబాద్ పరిధిలో బేగంబజార్‌లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెహిదీపట్నం, బతుకమ్మకుంటల్లో 42.2 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.
