
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో .. వైరస్ కట్టడికి అవసరమైన ప్రాంతాల్లో మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటుపై దృష్టిసారించాలన్నారు. బుధవారం ఆయన పలు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సీఎంలతో చర్చించారు. కరోనా రెండో దశకు చేరకుండా వెంటనే.. నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలన్నారు. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ కేంద్రాలు పెంచాలని సూచించారు. కరోనాపై పోరాటం ద్వారా భారత్ సాధించిన ఆత్మవిశ్వాసం.. నిర్లక్ష్యానికి దారితీయరాదన్నారు. ప్రజలు ఆందోళన, భయానికి గురయ్యేలా కాకుండా ముందు జాగ్రత్త చర్యలతో వారి ఇబ్బందులు తొలగించాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 10శాతం టీకాలు వృథా అయ్యాయన్న ప్రధాని మోడీ.. దీనిపై సమీక్షించుకోవాలన్నారు. కేసుల పెరుగుదలకు ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే ఈ వైరస్ దేశమంతా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాదు...వైరస్ కట్టడికి భారీగా పరీక్షలు నిర్వహించంతో పాటు కొవిడ్ నిబంధనల్ని మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు.