ఎంతో మందిలాగే జ్యోతి అద్నానీ కూడా కెనడా వెళ్లి అక్కడ పౌరసత్వం పొంది స్థిరపడాలని చాలా కలలు కన్నది. కానీ, మూడేళ్లకే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి ఇండియాకు వచ్చేసింది. అసలు ఆమె అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సోషల్ మీడియాలో వివరించింది.
2022 వరకు కెనడాలోనే ఉండాలనే, అక్కడే సెటిల్ అవ్వాలని జ్యోతి గట్టిగా నిర్ణయించుకుంది. కానీ, రోజులు గడిచేకొద్దీ అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా ఖర్చులు పెరిగి, అక్కడ జీవన వ్యయం సామాన్యులకు అందనంతగా పెరిగిపోయింది. మరోపక్క ఉద్యోగాల కొరతతో జాబ్ మార్కెట్ దారుణంగా తయారైంది. విపరీతమైన వలసల ప్రభావంతో అక్కడ బతకడమే ఒక యుద్ధంలా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు సమస్య ఆరోగ్యం
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించడం మరో ఎత్తు. కెనడాలోని వైద్య వ్యవస్థ గురించి ఆమె కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. అక్కడ డాక్టరును సంప్రదించడం చాలా కష్టమైన పని. వైద్యం చాలా ఆలస్యంగా అందుతుంది ఇంకా ఎంతో ఖరీదైనది. అనారోగ్యంతో ఉన్నప్పుడు సరైన వైద్యం అందకపోతే అది శారీరకంగానే కాకుండా, మానసికంగా, ఆర్థికంగా కూడా కుంగదీస్తుందని ఆమె పేర్కొన్నారు.
స్టూడెంట్ లోన్
ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెరిగిన ఖర్చులు, వీటికి తోడు చదువు కోసం తీసుకున్న స్టూడెంట్ లోన్ ఇవన్నీ కలిసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక అక్కడ ఉండటం అసాధ్యమని భావించిన జ్యోతి, తన ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు తిరిగి వచ్చేశారు.
కెనడా తనకు చాలా నేర్పిందని, ఒక కొత్త దేశానికి వెళ్లి సున్నా నుండి జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో, వలసదారుడిగా ఉండటం అంటే ఏమిటో తనకు తెలిసిందని జ్యోతి చెప్పారు. అయినసరే.. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదని భావించిన ఆమె స్వదేశానికి వచ్చేసారు. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

