అంతర్జాతీయ విమానాలపై జూన్ 30 వరకు నిషేధం

అంతర్జాతీయ విమానాలపై జూన్ 30 వరకు నిషేధం

న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమానాల రాకపోకలపై భారతదేశం జూన్‌ 30 వరకు నిషేధం పొడిగించింది. ప్రభుత్వ సూచనల  మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిసిజిఎ) శుక్రవారం సర్య్కూలర్‌ జారీ చేసింది. కరోనా కేసులు అదుపులోకి రాకపోవడం.. లాక్ డౌన్ కొనసాగించాల్సిన పరిస్థితులు, మరో వైపు వ్యాక్సినేషన్ తదితర పరిణామాల నేపధ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై పాక్షిక నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎంపిక చేసిన మార్గాల్లో  షెడ్యూల్‌ చేసిన అంతర్జాతీయ విమానాలను అనుమతించవచ్చునని డీజీసీఏ తెలిపింది. 
దేశంలో కరోనా తొలి దశ మొదలైన నాటి నుండి అంటే మార్చి 23, 2020 నుండి మన దేశం అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే నెల నుండి వందే భారత్‌ మిషన్‌ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలకు అనుమతిచ్చింది. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే జులై నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం 'ఎయిర్‌ బబుల్‌' కింద నడుపుతున్నారు. అమెరికా, బ్రిటన్‌, యుఎఇ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ తదితర 27 దేశాలతో ఒప్పందం జరిగింది. ఎయిర్‌బబుల్‌ ఒప్పందం ప్రకారం ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఆయా దేశాలు ప్రత్యేక విమానాలను వారి భూభాగాల మధ్య నడుపుకుంటాయి.