భారత క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఉన్ముక్త్‌ చంద్‌

భారత క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఉన్ముక్త్‌ చంద్‌

భారత ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ శుక్రవారం భారత్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకే తాను భారత్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఉన్ముక్త్‌ చంద్‌ స్పష్టం చేశాడు. ఇదే విషయమై ఉన్మక్త్‌ ట్విటర్‌ వేదికగా BCCIకి  లెటర్ రాశాడు. 2012 అండర్‌ 19 వరల్డ్ కప్  ఫైనల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్ముక్త్‌ చంద్‌ (111 పరుగులు నాటౌట్‌) సెంచరీతో భారత్‌కు కప్‌ అందించి 19 ఏళ్లకే  సెలబ్రిటీ అయ్యాడు.

ఆ తర్వాత ఇండియా- ఏకు కెప్టెన్‌గా ఎంపికైన ఉన్ముక్త్ 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. 2013 చాంపియన్స్‌ ట్రోఫీ, 2014 టీ20  వరల్డ్ కప్ కు  భారత ప్రాబబుల్స్ జాబితాలో స్థానం లభించినా.. తుదిజట్లలో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. ఓ దశలో ఇండియా-ఏ కెప్టెన్సీ కూడా దక్కినా, అది కూడా కొద్దికాలమే. ఓవరాల్ గా తన కెరీర్ లో ఎక్కువభాగం ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్ లో కొనసాగాడు. IPL లోనూ కొద్దిమేర మాత్రమే కనిపించాడు.
 
ఉన్ముక్త్‌ చంద్‌ 65 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 4505 రన్స్, ఇక టీ20 క్రికెట్‌లో 77 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన చంద్‌ 1565 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఆడిన ఉన్మక్త్‌ చంద్‌ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించాడు.

భారత్‌ క్రికెట్‌కు తన రిటైర్మెంట్‌పై ఉన్ముక్త్‌ చంద్‌ స్పందిస్తూ.. ఇకపై ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికెట్ లీగ్ లలో పాల్గొంటానని తెలిపాడు. భారత్ లో ఆటకు రిటైర్మెంటు ప్రకటించడంతో తాను మాజీ ఆటగాడ్ని అవుతానని, దీంతో విదేశీ లీగ్ పోటీల్లో ఆడేందుకు అడ్డంకులు ఉండబోవని చెప్పాడు. మొత్తంగా ఉన్ముక్త్ చంద్ తనకు మరిన్ని అవకాశాలు రావాలంటే రిటైర్మెంట్ ప్రకటించడం తప్పనిసరని చెప్పుకొచ్చాడు.