ఇంటర్నేషనల్ సైబర్ ముఠాలో మరో 13 మంది అరెస్ట్

ఇంటర్నేషనల్ సైబర్ ముఠాలో మరో 13 మంది అరెస్ట్
  • పరారీలో మరో 8 మంది నిందితులు

సత్తుపల్లి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసం కేసులో కీలక నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరితో పాటు మరో 13 మందిని సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు పంపారు. మరో 8 మంది పరారీలో ఉన్నారని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌‌ స్టేషన్‌‌లో ఆమె వివరాలు వెల్లడించారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండకు చెందిన ఉడతనేని వికాస్ చౌదరి(ఏ–1), ఆయన భార్య బొప్పన నాగప్రియ, అడపా రామవెంకటచరణ్ చౌదరి అలియాస్ చరణ్‌‌లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

చరణ్‌‌ను సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్‌‌లో అరెస్ట్ చేసి విచారించగా ముఠా కార్యకలాపాలపై కీలక వివరాలు బయటపడ్డాయని వెల్లడించారు. మొత్తం 14 మందిని రిమాండ్​కు పంపామని,  పరారీలో ఉన్న నాగప్రియ, ఇస్లావత్ లక్ష్మీకల్యాణ్, శీలం వేణుగోపాలరావు, నల్లంగుల శ్వేతన్, వీరంశెట్టి వంశీ, బిల్లా సాయితరుణ్, సంగం ప్రవీణ్ కుమార్, భూక్యా తరుణ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు 

మోసాలు ఇలా..

2020 నుంచి గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాలతో పాటు విదేశాల్లో ఉన్న అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లతో జతకట్టి కాల్ సెంటర్లు నడిపారు. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, క్రిప్టో ట్రేడింగ్, మ్యాట్రిమోనీ, అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించి మోసం చేశారు. టెలిగ్రామ్ గ్రూపుల్లో మోసపూరిత లింకులు పంపి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచుకున్నారు. ఆ డబ్బును వివిధ ఖాతాలకు మళ్లించి యూఎస్ డాలర్లు, క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలోకి మార్చినట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు సుమారు రూ.580 కోట్ల మేర మోసం జరిగినట్లు గుర్తించారు.