- ఈ నెల 27న తిరిగి ఎగ్జామ్
హైదరాబాద్, వెలుగు: ఇటీవల జరిగిన ఫైనల్ ఎంబీబీఎస్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను రద్దు చేస్తూ కాళోజీ నారాయణరావు హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్సిటీ (కేఎన్ఆర్యూహెచ్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రూల్స్ ప్రకారం మెడికల్ ఎడ్యుకేషన్ లో పాత రెగ్యులేషన్స్, కొత్త రెగ్యులేషన్స్ అమల్లో ఉన్నాయి. ఈ రెండు రెగ్యులేషన్ల మధ్య సిలబస్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంది.
పాత రెగ్యులేషన్స్ లో పేపర్-1లో ఉన్న కొన్ని చాప్టర్లు, కొత్త రూల్స్ ప్రకారం పేపర్-2లోకి మార్చారు. ఈ నెల 15న జరిగిన జనరల్ సర్జరీ పేపర్-1లో కొత్త సిలబస్ ప్రకారం పేపర్-2లో ఉండాల్సిన కొన్ని ప్రశ్నలు పేపర్-1లో వచ్చాయి. సిలబస్ వెలుపల నుంచి ప్రశ్నలు రావడంతో పరీక్ష రాసిన విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. దీనిపై వర్సిటీకి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అందాయి. దీంతో ఈ నెల 15న జరిగిన పరీక్షను రద్దు చేశారు. తిరిగి ఈ నెల 27న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

