- కార్మికుల తొలగింపు ఉత్తర్వులతో పెల్లుబికిన ఆగ్రహం
- 150 మందికి పైగా అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. కేటీపీఎస్ ఐదు, ఆరు, ఏడు దశల్లో పనిచేస్తున్న 1,610 మంది ఆర్టీజన్ కార్మికులను తొలగిస్తూ జెన్కో చీఫ్ ఇంజనీర్ వాట్సాప్ ద్వారా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీజన్‌లు పాల్వంచకు తరలివచ్చి కేటీపీఎస్ ఎదుట నిరసనలు చేపట్టగా, పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. పోలీస్ పహారా మధ్య కార్మికులు తమ నిరసన కొనసాగించారు.
సమ్మె చేస్తాం: జేఏసీ
రాష్ట్ర ప్రభుత్వం, జెన్కో యాజమాన్యం మొండి వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు కేశబోయిన కోటేశ్వరరావు, రాజేందర్, డి.రాధాకృష్ణ, సాధం రామకృష్ణ, రామారావు, అంకిరెడ్డి నరసింహారావు, జాలే కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. గత నాలుగు రోజులుగా కేటీపీఎస్ ఆస్పత్రి ఎదుట ఆర్టీజన్‌లు రాత్రింబవళ్లు దీక్షలు చేస్తున్నా యాజమాన్యం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు వంటావార్పు చేస్తూ అక్కడే ఉండి నిరసనలు కొనసాగిస్తారని చెప్పారు. ఈ నెల 13 వరకు లేబర్ కమిషన్ చర్చలకు అనుమతించినప్పటికీ కార్మికులను టెర్మినేట్ చేయడం దారుణమనమన్నారు.
ఎక్కడికక్కడే అరెస్టులు..
ఆందోళనలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కార్మికులు తరలివస్తున్నారనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 మందికి పైగా ఆర్టీజన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు కార్మికులు ఆటోల ద్వారా శిబిరానికి చేరుకున్నారు. కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పాల్వంచలో ఆర్టీజన్‌ల నిరసనలకు కాంగ్రెస్ నేత కోనేరు సత్యనారాయణ, న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత ఆవునూరి మధు, బీజేపీ కార్పొరేటర్ చెరకు భాగ్యలక్ష్మి సంఘీభావం తెలిపారు.
