మెడికల్ బిల్లులు జీతాల్లో కోత

మెడికల్ బిల్లులు జీతాల్లో కోత
  •    మెడికల్​ బిల్లులు జీతంలో కట్ ​చేస్తున్రు
  •    ఆందోళనలో సింగరేణి కార్మికులు
  •    ఎంప్లాయీస్​పై రెఫర్ ​కేసుల 
  •    ట్రీట్​మెంట్ ​భారం
  •     ఏడాది క్రితం వాటికీ ఇప్పుడు కోతలు

మందమర్రి, వెలుగు: -మందమర్రి ఏరియాలోని ఒక డిపార్ట్​మెంట్​లో పనిచేసే ఎంప్లాయ్​తండ్రి గత ఏడాది కరోనా బారినపడితే ఆయనను హైదరాబాద్​లోని కార్పొరేట్ హాస్పిటల్​కు సింగరేణి హాస్పిటల్ ​డాక్టర్లు రెఫర్​చేశారు. ఇప్పుడు అడిషనల్​మెడికల్​ బిల్లుల పేరిట యాజమాన్యం ఆ ఎంప్లాయీ శాలరీ నుంచి రూ.6,736 కోత విధించింది. మందమర్రి ఏరియా వర్క్​షాప్​లో పనిచేసే కార్మికుడు మూడేండ్ల కిందట రోడ్​యాక్సిడెంట్​కు గురవడంతో కార్పొరేట్​హాస్పిటల్​కు రెఫర్​ చేశారు. ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న ఆ ఎంప్లాయీకి అడిషనల్​మెడికల్​ బిల్లుల పేరిట జీతంలో రూ.12,353 కట్​ చేశారు. సింగరేణి వ్యాప్తంగా పలువురు ఎంప్లాయీస్​ వేతనాల నుంచి అడిషనల్ ​మెడికల్​ బిల్లులంటూ కోత విధించడం కలకలం రేపుతోంది. సింగరేణి ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులను ట్రీట్​మెంట్​ కోసం కార్పొరేట్​హాస్పిటల్​కు రెఫర్​ చేసి.. ఇప్పుడు వేతనాల్లో కోత విధించడాన్ని ఎంప్లాయీస్​ తప్పు పడుతున్నారు.  ట్రీట్​మెంట్​టైంలో  సరైన ఇన్ఫర్మేషన్​ఇవ్వలేదని, ప్రస్తుతం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జీతంలో కోత విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో కార్మికుడి దగ్గర రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు అడిషనల్ మెడికల్​​ బిల్లుల పేరుతో కటింగ్​చేస్తున్నారని కార్మిక సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు.

ఏడాది క్రితం కేసులకు..
సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ఫ్రీ మెడికల్​ఫెసిలిటీస్​కల్పించాల్సి ఉంది. ఖర్చు ఎంతైనా సింగరేణి యాజమాన్యం భరించాల్సిందే. నవంబర్​లో చత్తీస్​గఢ్​లోని బొగ్గు గని కార్మికుడి కూతురు ట్రీట్​మెంట్​కు కోలిండియా యాజమాన్యం ఏకంగా రూ.16 కోట్లు అందించింది. అయితే సింగరేణిలో మాత్రం ఫ్రీ మెడికల్​ట్రీట్​మెంట్​విషయంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో  ఏటా దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సింగరేణి చెబుతోంది. అలాంటిది కొత్తగా అడిషనల్​మెడికల్​ బిల్లులంటూ ఉద్యోగుల జీతాల్లో కటింగ్ ​పెడుతున్నారు. రోగిని రెఫర్​చేసినప్పుడు కార్పొరేట్​హాస్పిటల్​ఖర్చు గురించి సింగరేణికి  ముందే చెబుతుందని, శాంక్షన్​పొందిన తర్వాతే ట్రీట్​మెంట్ షురూ చేస్తుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఏడాది అంతకన్నా ముందు ట్రీట్​మెంట్​ పొందినవారికి ఇప్పుడు బిల్లులు రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

అంతంతగానే వైద్యం
నెలకు వందల సంఖ్యలో రోగులను కార్పొరేట్​ఆసుపత్రులకు రెఫర్​చేయడం సింగరేణిలో ఒక తంతుగా మారింది. ఎక్కువగా సరైన సౌలత్​లు లేని ఆసుపత్రులకు రెఫర్​ చేస్తున్నారు. లీడర్లు, ఆఫీసర్లతో పైరవీలు చేస్తే తప్ప రోగికి అనుకూలమైన హాస్పిటల్​కు పంపడం లేదు.  కంపెనీ నుంచి రూ. లక్షల్లో బిల్లులు దండుకుంటున్న కార్పొరేట్​హాస్పిటల్స్​ఎంప్లాయీస్, వారి కుటుంబాలను జనరల్​వార్డుల్లోనే ఉంచుతున్న ఘటనలున్నాయి. కనీస ప్రత్యేకతను కూడా చూపడంలేదు. నిమ్స్​ టారీఫ్​ ప్రకారం ట్రీట్​మెంట్​ బిల్లులు చెల్లిస్తామనడంతో అర్హత లేని ఆస్పత్రులన్నీ  సింగరేణితో అగ్రిమెంట్​ చేసుకునేందుకు ముందుకొస్తున్నాయని కార్మిక  సంఘాలు ఆరోపిస్తున్నాయి.  చాలామంది చికిత్స కోసం రెఫర్​ చేసిన కార్పొరేట్​ఆసుపత్రికి వెళ్లి వచ్చి మళ్లీ సొంతంగా పేరున్న హాస్పిటల్​లో అవుట్ పేషెంట్లుగా ట్రీట్​మెంట్​పొందుతున్నారు. 

నోటీసు ఇవ్వకుండా కటింగ్​లు వద్దు
సింగరేణి కార్మికులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అడిషనల్​ మెడికల్​ బిల్లుల చెల్లింపు పేర వేతనాల్లో కోత విధించవద్దు. జాయింట్ బైపార్టెడ్​కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ (జేబీసీసీఐ) అగ్రిమెంట్​ప్రకారం ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ఎంత ఖర్చైనా సింగరేణి యాజమాన్యం భరించి ఫ్రీ ట్రీట్​మెంట్​అందించాలె.  బిల్లుల వసూలు అగ్రిమెంట్​కు విరుద్ధం.
- వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ నేత