భారతదేశం ఇప్పుడు ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సాక్ష్యమిస్తోంది. అ శక్తి ఒక రాజకీయ పార్టీ కాదు.. జెన్ జెడ్ అనే దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన ఒక కొత్త తరంగం. పరీక్షలలో అవకతవకలు, నిరుద్యోగం, కొరవడిన పారదర్శకత, జవాబుదారీతనం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ఏకమై ధ్వజమెత్తారు. ఇది కేవలం ఒకే ఒక్క సంఘటనపై కలిగిన ఆగ్రహానికి మించి మరింత లోతైన విషయాన్ని ప్రతిబింబిస్తోంది. అన్యాయం జరిగిందని భావించినప్పుడు మౌనంగా ఉండటానికి ఇష్టపడని ఒక తరం ఆవిర్భావానికి ఇది సంకేతం. నేటి విద్యార్థులు విజ్ఞానవంతులు, ధైర్యవంతులు. వారు పాలనలో నాణ్యత, ప్రభుత్వ విద్య భవిష్యత్తు, తమకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి సమంజసమైన ప్రశ్నలను సూటిగా అడుగుతున్నారు. అయితే, వారిపట్ల సానుభూతితో జవాబుదారీతనంతో స్పందించడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనలపై చాలాసార్లు అణచివేత వైఖరిని అవలంబించి ఘర్షణలతోనే సమాధానమిచ్చింది.
శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు సంబంధించిన దృశ్యాలు కోట్లాది మంది భారతీయులను కలవరానికి గురిచేశాయి. ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అసమ్మతిని బలప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరిస్తుందని వారు విశ్వసించారు. విద్యా వ్యవస్థలోని అత్యున్నత స్థాయిలలో బాధ్యత వహించాలనే పిలుపులతో సహా, జవాబుదారీతనం కోసం కొనసాగుతున్న డిమాండ్ కేవలం ఒక మంత్రికి లేదా ఒక సంఘటనకు సంబంధించినది కాదు. పబ్లిక్ సంస్థలు విఫలమైనప్పుడు ప్రభుత్వాలు తమ తప్పును అంగీకరించాలనే విస్తృతమైన అంచనాకు ఇది సంబంధించినది. నాయకులు తమ తప్పులను అంగీకరించి, సంస్థాగత వైఫల్యాలను సరిదిద్ది, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించినప్పుడు ప్రజాస్వామ్యాలు మరింత బలపడతాయి. ఈ యువజన సమీకరణ ప్రాముఖ్యత కేవలం పరీక్షల తక్షణ సమస్యకే పరిమితం కాదు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిర్వచనంగా మారిన పాలనా శైలి పట్ల పెరుగుతున్న నిరాశను ప్రతిబింబిస్తోంది.
శాంతియుత నిరసనలపై కేంద్రం బలప్రయోగం
ప్రజావ్యతిరేక పాలనతో అధికార కేంద్రీకరణ,
విమర్శలను ఏమాత్రం సహించకపోవడం, ప్రజాస్వామ్యానికి ఉన్న అవకాశాలు కుంచించుకుపోవడం, శాంతియుత నిరసనలపై చర్చలకు బదులుగా బలప్రయోగం చేసే ధోరణి వంటివి యువత గళమెత్తడానికి కారణాలుగా ఉన్నాయి. యువ భారతదేశం ఒక స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది. జవాబుదారీతనం, కరుణ, రాజ్యాంగ విలువలతో కూడిన పాలనను నేటి తరం కోరుకుంటోంది. భారతదేశపు జెన్ జెడ్ కేవలం సిద్ధాంతాలతోనే ముందుకు వెళ్లడం లేదు. అది ఆకాంక్షలతో నడుస్తోంది. ప్రతిభకు ప్రతిఫలం, సంస్థల విశ్వసనీయత, సమాన అవకాశాలు, రాజ్యాంగం కేవలం ప్రసంగాలలోనే కాకుండా పాలనలో గౌరవించే దేశాన్ని ఈ తరం కోరుకుంటోంది. గణతంత్ర భవిష్యత్తుపై వారికి ప్రగాఢమైన శ్రద్ధ ఉన్నందువల్లే వారు కేంద్రాన్ని కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నారు. జెన్ జెడ్ డిమాండ్లు అణచివేతకు కాదు, చర్చలకు అర్హమైనవిగా మోదీ సర్కార్ గుర్తించాలి.
జెన్ జెడ్‌కు రాహుల్ నైతిక ధైర్యం
ఈ కీలకమైన తరుణంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులతో మమేకమై వారితో భుజం భుజం కలిపి నిలబడాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థులను కలుసుకున్నారు. వారి మాటలు విన్నారు. పార్లమెంటులోనూ, దేశవ్యాప్తంగానూ వారి ఆందోళనలను విస్తృతంగా వినిపించారు. భారతీయ యువతను మోదీ ప్రభుత్వం శత్రువులుగా చూడకుండా, భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువ భారతీయులను భాగస్వాములుగా చేయాలని ఆయన కోరారు. కేవలం రాజకీయ నినాదాల కోసం కాకుండా, సానుభూతి, నిజాయితీ, నైతిక ధైర్యం కోసం ఎదురుచూస్తున్న నేటి తరానికి రాహుల్ ప్రజాస్వామ్య విధానం ఎంతగానో నచ్చింది. అందువల్ల, ప్రజాస్వామ్య, సమ్మిళిత, రాజ్యాంగబద్ధమైన ప్రత్యామ్నాయాన్ని అందించగల ప్రధాన జాతీయ నాయకుడిగా రాహుల్ గాంధీని చాలామంది యువ భారతీయులు చూడటంలో ఆశ్చర్యం లేదు. విభజనకు బదులుగా సంభాషణ, ఘర్షణకు బదులుగా కరుణ, నిరంకుశత్వానికి బదులుగా రాజ్యాంగబద్ధత అనే రాహుల్ రాజకీయాలు.. భయానికి బదులుగా ఆశను కలిగించే రాజకీయాలను కోరుకునే తొలిసారి ఓటర్లు, యువ భారత పౌరుల ఆదరణ పొందాయి. చారిత్రాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తన గొప్ప బలాన్ని సామాన్య భారతీయుల, ముఖ్యంగా యువత ఆకాంక్షల నుంచే పొందింది.
ప్రజాస్వామ్య ఉద్యమాలకు...
భారతీయ యువత ఆదర్శం
మనం వారి సమస్యలను చిత్తశుద్ధితో విని, సమస్యల పరిష్కారానికి విశ్వసనీయమైన విధాన ప్రత్యామ్నాయాలను అందిస్తూ.. రాజ్యాంగ విలువలను పరిరక్షించడంలో దృఢంగా నిలబడితే ఈ వర్ధమాన తరానికి కాంగ్రెస్‌పై విశ్వాసం మరింతగా పెరుగుతుంది. పరివర్తనాత్మక రాజకీయ మార్పుకు తరచుగా యువతే నాయకత్వం వహిస్తారని చరిత్ర మనకు బోధిస్తుంది. స్వాతంత్ర్య పోరాటం నుంచి ఆ తర్వాతి ప్రజాస్వామ్య ఉద్యమాల వరకు భారతదేశ యువత ఆదర్శవాదం, ధైర్యమే రాజకీయ వ్యవస్థను దిగివచ్చి వినేలా చేసింది. ప్రస్తుత ఉద్యమం కూడా అలాంటి మరో కీలక ఘట్టంగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇది కేవలం పరీక్షలు లేదా ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యమం కాదు. ఇది భారత ప్రజాస్వామ్య స్వరూపానికే సంబంధించినది. విశ్వవిద్యాలయాలలో, తొలిసారి ఓటు వేయనున్న వారిలో, భారతదేశ యువతలోని విస్తృత వర్గాలలో ఒక స్పష్టమైన రాజకీయ భావన రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. రాహుల్ గాంధీ దేశానికి ప్రాధాన్యమిచ్చే ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య నాయకుడిగా అంతకంతకూ గుర్తింపు పొందుతున్నారు. చాలామంది యువ భారతీయుల దృష్టిలో రాహుల్ గాంధీని ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం ఆయన రాజకీయాలు మాత్రమే కాదు. మాట్లాడే ముందు ఇతరుల మాట వినడానికి సిద్ధంగా ఉండటం, తమ మాట పాలకులు వినడం లేదని భావించేవారికి అండగా నిలవడం, గణనీయమైన రాజకీయ మూల్యం చెల్లించాల్సి వచ్చినా రాజ్యాంగ విలువలను పరిరక్షించడం వంటివి రాహుల్ గాంధీని ప్రత్యేకంగా నిలిపాయి.
రాహుల్ నాయకత్వంపై యువత భరోసా
జెన్ జెడ్ తరానికి నాయకత్వం అనేది ఇకపై కేవలం వాక్చాతుర్యం లేదా ఎన్నికల లెక్కలతో కొలవడం కుదరదు. అది నిజాయితీ, సానుభూతి, కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యంతో కొలవడం జరుగుతుంది. రాహుల్ గాంధీలో చాలామంది యువ భారతీయులు ఈ విలువలను నిలకడగా సమర్థించిన నాయకుడిని చూస్తున్నారు. ఈ ఉద్యమ సమయంలో విద్యార్థులకు ఆయన చూపిన సంఘీభావం ఆ అభిప్రాయాన్ని మరింత బలపరిచింది. కొత్త తరానికి, వారు తమ సొంత వ్యక్తిగా భావిస్తున్న నాయకుడికి మధ్య భావోద్వేగ బంధాన్ని దృఢపరిచింది. స్వాతంత్ర్య భారతదేశంలో జరిగిన ప్రతి ప్రధాన రాజకీయ పరివర్తనకు యువత ఆకాంక్షలే చోదకశక్తిగా నిలిచాయి. ప్రస్తుత విద్యార్థి ఉద్యమ పరంపర కూడా అలాంటి మరో కీలక ఘట్టంగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రజాస్వామ్య శక్తి ఇలాగే పెరుగుతూ ఉంటే, భారతదేశ యువత ఆందోళనలు జాతీయ చర్చల్లో కేంద్ర స్థానంలో ఉంటే కాంగ్రెస్ విశ్వసనీయమైన, రాజ్యాంగబద్ధమైన, సమ్మిళిత ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఈ ఉద్యమం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయగలదు.
ప్రజాస్వామ్య నాయకుడిగా రాహుల్ గాంధీ
2029 వైపు దేశ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కానీ చరిత్ర తన గమనాన్ని మార్చుకునే ముందు తరచుగా నిశ్శబ్దంగా తన ఉనికిని చాటుకుంటుంది. నేడు భారతదేశ క్యాంపస్‌ల నుంచి వినిపిస్తున్న స్వరం కేవలం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే నిరసన మాత్రమే కాదు. అది కరుణ, జవాబుదారీతనం, రాజ్యాంగబద్ధమైన, నైతికతలో పాతుకుపోయిన ఒక విభిన్నమైన రాజకీయ శైలికి పిలుపు. ఆ పిలుపు రాహుల్ గాంధీ నాయకత్వం చుట్టూ అంతకంతకూ కేంద్రీకృతమవుతోంది. చరిత్ర చివరికి ఈ గమనాన్ని ధృవీకరిస్తుందా లేదా అనేది ఎప్పటిలాగే భారతదేశ ప్రజల వివేకంపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, రాహుల్ గాంధీ దేశం కోరుకుంటున్న ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య నాయకుడిగా ఎదుగుతున్నారనే విషయం అంతకంతకూ స్పష్టమవుతోంది. ఈ జోరు ఇలాగే బలం పుంజుకుంటూ ఉంటే, 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశానికి నాయకత్వం వహించే బాధ్యతను భారత ప్రజలు రాహుల్ గాంధీకి అప్పగించే అవకాశం ఉంది. అప్పుడు జెన్ జెడ్ ఉద్యమం కేవలం ఒక విద్యార్థి నిరసనగా మాత్రమే కాకుండా, భారతదేశపు తదుపరి రాజకీయ అధ్యాయానికి నాందిగా గుర్తుండిపోవచ్చు.
- కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నీటిపారుదల, పౌర సరఫరాల
శాఖ మంత్రి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
