- కొత్తగా ఏర్పాటైన మద్దూరు, దేవరకద్ర మున్సిపాలిటీలు
- జడ్చర్ల మున్సిపల్ పాలకవర్గానికి ఇంకా ముగియని పదవీకాలం
- ఈ నెల 10న ఓటరు తుది జాబితా విడుదల
మహబూబ్‌నగర్, వెలుగు: ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. తాజాగా కార్పొరేషన్లు, మున్సిపల్ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఓటర్ల తుది జాబితా, పోలింగ్‌స్టేషన్ వివరాలను పబ్లిష్ చేయాలని గత నెల 29న నోటిఫికేషన్రిలీజ్చేసింది.
ఈ మేరకు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని దేవరకద్ర, భూత్పూర్, మక్తల్, నారాయణపేట, మద్దూరు, కోస్గి మున్సిపాలిటీల్లో, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో ఆఫీసర్లు గురువారం ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్స్టేషన్ల వివరాలను వార్డుల వారీగా మున్సిపల్ ఆఫీస్‌లలో అందుబాటులో ఉంచారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 4వ తేదీలోగా మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు.
5న అన్ని రాజకీయ పార్టీల లీడర్లతో సమావేశం నిర్వహించనున్నారు. 6న జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారులు సమావేశమవుతారు. 10న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అయితే మహబూబ్నగర్జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం ఇంకా ముగియలేదు. మరో 5 నెలల సమయం ఉండటంతో ఇక్కడ ఎన్నికలు తర్వాత నిర్వహించనున్నారు.
కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన ఏడాదికే..
గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్‌నగర్‌ను గతేడాది జనవరి 28న రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత జూన్‌లో వార్డుల డీలిమిటేషన్ చేపట్టారు. దీంతో గ్రేటర్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 49 వార్డులు ఉండగా.. దివిటిపల్లి, జైనల్లీపూర్ గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేసి, మొత్తం 60 డివిజన్లుగా విభజించారు.
కాగా.. కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన ఏడాదికే పాలమూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా డివిజన్ల నుంచి మొదటిసారి కార్పొరేటర్లుగా పోటీ చేయాలని ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లీడర్ల వద్దకు పరుగులు తీస్తూ హైకమాండ్‌కు తమ పేరు సిఫార్సు చేయాలని కోరుతున్నారు.
పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా..
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పలు మేజర్‌గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డులు, మద్దూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
మహిళా ఓటర్లే అధికం..
పాలమూరు కార్పొరేషన్, మిగతా 6 మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం.. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో మహిళా ఓటర్లు 1,00,166 మంది, పురుషులు 97,675 మంది ఉన్నారు. మున్సిపాలిటీల వారీగా చూస్తే.. దేవరకద్రలో మహిళా ఓటర్లు 5,161 మంది, పురుషులు 4,909 మంది, కోస్గిలో మహిళా ఓటర్లు 10,219 మంది, పురుష ఓటర్లు 10,028 మంది, మద్దూరులో మహిళా ఓటర్లు 6,564 మంది, పురుషులు 6,223 మంది, భూత్పూర్లో మహిళా ఓటర్లు 6,089 మంది, పురుషులు 5,979 మంది, నారాయణపేటలో మహిళా ఓటర్లు 18,216 మంది, పురుష ఓటర్లు 17,244 మంది ఉన్నారు.
కార్పొరేషన్లో 60 డివిజన్లు..
మహబూబ్నగర్కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 1,97,855 మంది ఓటర్లకు 200 పోలింగ్సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
వార్డులు, ఓటర్లు, పోలింగ్ సెంటర్ల వివరాలు
మున్సిపాలిటీ వార్డులు ఓటర్లు పోలింగ్ స్టేషన్లు
నారాయణపేట 24 35,460 48
కోస్గి 16 20,248 32
మద్దూరు 16 12,787 20
దేవరకద్ర 12 10,070 12
భూత్పూర్ 10 12,064 11
మక్తల్ 16 23,371 37
