‘బ్రహ్మాస్త్ర’ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తూ.. ‘దంగల్’ డైరెక్టర్ నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) సినిమా ట్రైలర్ విడుదలైంది. VFX విషయంలో ఎక్కడా రాజీపడలేదని ట్రైలర్ చూశాక స్పష్టమైంది. శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్ చూడచక్కగా ఉన్నాడు. రావణుడిగా ‘యష్’ లుక్ అదిరిపోయింది. 4 నిమిషాల 9 సెకన్ల ట్రైలర్లో రామాయణం ఇతివృత్తం ఏంటనేది చూపించేశారు.
తండ్రి మాటకు కట్టుబడి అడవుల బాట పట్టిన రాముడిని చూపించారు. రాముడి అడుగు జాడల్లో నడిచిన సాధ్వి సీతను చూపించారు. సూర్పణకను చూపించారు. సీతారాములను, రావణుడిని ఎక్కువగా హైలైట్ చేస్తూ ట్రైలర్ సాగింది. సీత పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. సూర్పణకగా రకుల్ ప్రీత్ సింగ్ సరైన ఛాయిస్ అని అర్థమైంది. విజువల్స్ బాగున్నాయి. ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గానే ఉంది. కానీ.. ట్రైలర్ చూస్తే ‘రామాయణ’ సినిమా సీన్స్ ఒక రిచ్ సీరియల్ షాట్స్లా అనిపించాయి. ఈ ట్రైలర్ మొత్తంలో హనుమంతుడి పాత్రను పరిచయం చేయకపోవడం.. కనీసం ఒక్క షాట్ కూడా చూపించకపోవడం ట్రైలర్ చూసిన ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది.
ఉద్దేశపూర్వకంగానే చూపించకుండా థియేటర్లలో చూపించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారేమోననే డిబేట్ మొదలైంది. ఓవరాల్గా ‘రామాయణ’ విజువల్స్ బాగున్నప్పటికీ సీరియల్ షాట్స్ను గుర్తుచేస్తుండటం ప్రేక్షకులను కలవరపాటుకు గురిచేసే అంశం. అలా అని ‘రామాయణ’ విజువల్స్ను పూర్తిగా తీసి పారేయలేం. వెండి తెరపై ‘రామాయణ’ విజువల్స్ చూస్తే ప్రేక్షకుల అభిప్రాయం మారే అవకాశం లేకపోలేదు.
నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘రామాయణ’ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. 2026 దీపావళికి ‘రామాయణ’ మొదటి భాగం విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. రెండో భాగం 2027 దీపావళికి విడుదలవుతుందని ‘రామాయణ’ చిత్ర బృందం విడుదల తేదీలను కూడా ముందే ప్రకటించి ఈ సినిమాపై ధీమాగా ఉంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నారు.
