పోలీసుల అరాచకం: జర్నలిస్టుపై థర్డ్ డిగ్రీ.. గుజరాత్ డీజీపీకి NHRC నోటీసులు..

పోలీసుల అరాచకం: జర్నలిస్టుపై థర్డ్ డిగ్రీ..  గుజరాత్ డీజీపీకి  NHRC నోటీసులు..

గత నెలలో గుజరాత్‌కు చెందిన ఒక జర్నలిస్టును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేశారనే వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు సమర్పించాలని గుజరాత్ DGPకి నోటీసులు జారీ చేసింది.

సమాచారం ప్రకారం... మార్చి 22న రాజ్‌కోట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక ఆన్‌లైన్ మీడియా జర్నలిస్టును అదుపులోకి తీసుకున్నారు. అతడిని వివస్త్రుడిని చేసి, తలకిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టారని రిపోర్టులు చెబుతున్నాయి.

పోలీసుల దాడిలో గాయపడిన ఆ జర్నలిస్టును చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చుకోవద్దని ఆసుపత్రి సిబ్బందిని కూడా పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. బాధితుడిపై తప్పుడు కేసులు పెడతామని, అతడి ఇంటిని కూల్చేస్తామని పోలీసులు భయపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

►ALSO READ | అధికారం కాదు కదా.. కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవదు: ఎంపీ శశిథరూర్

 మీడియాలో వచ్చిన ఈ వార్తలను కమిషన్ స్వయంగా సుమోటోగా స్వీకరించింది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, ఇది మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని కమిషన్ అభిప్రాయపడింది.

జర్నలిస్టు ప్రస్తుత పరిస్థితి ఏమిటి.. ఈ ఘటనపై విచారణ ఏ దశలో ఉంది.. అనే అంశాలపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశించింది. ప్రస్తుతం ఆ జర్నలిస్ట్ గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.