రాష్ట్రానికి కొత్తగా 60 సూపర్ స్పెషాలిటీ సీట్లు.. 2025-26 విద్యా సంవత్సరానికి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రానికి కొత్తగా 60 సూపర్ స్పెషాలిటీ సీట్లు.. 2025-26 విద్యా సంవత్సరానికి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 36.. ప్రైవేటుకు 24 సీట్లు
  • నిమ్స్‌ కు 16, కాకతీయకు 10, ఉస్మానియాకు 7, గాంధీకి 3 సీట్లు కేటాయింపు
  • సిద్దిపేట ఆర్వీఎం మెడికల్ కాలేజీకి ఏకంగా 24 సీట్లకు పర్మిషన్

దేశవ్యాప్తంగా 2025– 26 విద్యాసంవత్సరానికి వివిధ మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచుతూ ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కాలేజీల్లో కొత్తగా 60 సూపర్ స్పెషాలిటీ  సీట్లను భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా 2025– 26 విద్యాసంవత్సరానికి గానూ వివిధ మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ సీట్లు పెంచుతూ నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కొత్తగా 60 సూపర్ స్పెషాలిటీ (డీఎం/ఎంసీహెచ్) సీట్లను భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

 ఈ మేరకు ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌ మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా అనుమతులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 36 సీట్లు, ప్రైవేటులో 24 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్య 420 దాటనుంది.

నిమ్స్ కు  16 సీట్లు

ఈసారి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ పెద్దపీట వేసింది. ముఖ్యంగా నిమ్స్, కాకతీయ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచింది. నిమ్స్ హాస్పిటల్ కు అత్యధికంగా 16 సీట్లు మంజూరయ్యాయి. సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, వాస్కులర్ సర్జరీ, న్యూరో పాథాలజీ వంటి కీలక డిపార్ట్​మెంట్లలో ఒక్కోదానికి 4 సీట్ల చొప్పున వచ్చాయి. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీకి 10 సీట్లు దక్కాయి. 

కార్డియాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, సీటీవీఎస్ డిపార్ట్​మెంట్లలో 2 సీట్ల చొప్పున కేటాయించారు. ఉస్మానియాకు క్యాన్సర్ చికిత్సకు ఊతమిచ్చేలా మెడికల్ ఆంకాలజీలో 4, సర్జికల్ ఆంకాలజీలో 3 సీట్లు పెరిగాయి. అలాగే.. సిద్దిపేటలోని ఆర్వీఎం ప్రైవేట్ మెడికల్ కాలేజీకి కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ సహా పలు డిపార్ట్​మెంట్లలో ఏకంగా 24 సీట్లకు అనుమతి లభించింది.

మన రాష్ట్రంలోనే ‘సూపర్’ విద్య.. 

సీట్లు పెరగడం వల్ల విద్యార్థులు సూపర్ స్పెషాలిటీ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా, మన రాష్ట్రంలోనే చదువుకునే అవకాశం ఉంటుంది. గుండె, కిడ్నీ, నరాల వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటికి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది. ఈ సీట్ల పెంపుతో రాష్ట్రంలోనే ఎక్కువ మంది నిపుణులు తయారవుతారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. అలాగే, ప్రభుత్వ హాస్పిటల్స్ లో పీజీ సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు అందుబాటులో ఉంటే.. రోగులకు 24 గంటల పాటు నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందనుంది.

గాంధీ చరిత్రలో ఇదో మైలు రాయి 

గాంధీ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ మెడిసిన్ (డీఎం) డిపార్ట్ మెంట్ లో 3 సీట్లకు అనుమతి లభించింది. మా కాలేజీ 75 ఏండ్ల చరిత్రలో ఇదొక మైలురాయి. డాక్టర్ కిరణ్, డాక్టర్ రాజశ్రీ, డాక్టర్ స్రవంతి తదితరుల గ్రౌండ్ వర్క్, నిమ్స్ నిపుణుల మార్గదర్శకత్వం, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఎన్‌ఎంసీ తనిఖీలకు రెండు నెలల ముందే అప్రమత్తం చేసిన డాక్టర్ విమలా థామస్, సహకరించిన మాజీ రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, డాక్టర్ వాణికి కృతజ్ఞతలు.

–  డాక్టర్ కిరణ్ మాధల, హెచ్‌వోడీ, 
క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ మెడికల్ కాలేజీ