నీట్ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. మోదీ పాలనలో విద్యావ్యవస్థ అవినీతి మయం అయిందన్నారు. డాక్టర్ కావాలి.. దేశానికి సేవ చేయాలి.. అని ఎన్నో ఆశలతో ఎగ్జామ్ రాసిన విద్యార్థులు.. పేపర్ లీక్ లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవి ఆత్మహత్యలు కాదు.. మోదీజీ హయాంలో అవినీతిమయమైనవ్యవస్థకు నిదర్శనం అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఆశలు, ఆర్థిక స్థితి, కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.
నీట్ పేపర్ లీక్ తో అభ్యర్థి ఆత్మహత్యపై రాహుల్ ఓ ట్వీట్ లో ప్రస్తావించారు. డాక్టర్ అయి దేశానికి సమాజానికి సేవ చేయాలని ఆమె ఆకాంక్ష.. ఓ ఆమె తండ్రి పేద రైతు ఆకాంక్ష.. తన కుమార్తెను డాక్టర్ చేయాలని కలలు కన్న ఆయన కిసాన్ క్రెడిట్ కార్డుపై 3 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు.. అంతే కాదు.. తన కుమార్తె కోచింగ్ కు వెళ్లడంకోసం వంటవాడిగా పనిచేస్తున్నాడు.. బిడ్డ చదువుకోసం శక్తి కొద్ది అన్నీ చేశారు.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటీ అంటూ ట్వీట్ లో రాశారు.
ప్రధాని మోదీ పదవీకాలంలో దేశంలో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనం అయిందని రాహుల్ ఆరోపించారు. ’’మోదీజీ అధికారం శాశ్వతం కాదు.. అది వస్తూ పోతూ ఉంటుంది.. కానీ మీరు 12 ఏళ్లలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ను నాశనం చేసిన తీరుకు దేశ యువత మూల్యం చెల్లించుకుంటోందన్నారు.’’ రాహుల్ గాంధీ.
ఎగ్జామ్ పేపర్ లీక్ తో నీట్-యూజీ పరీక్ష రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. జూన్ 21 న మరోసారి పరీక్ష నిర్వహిస్తామని జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) ప్రకటించింది. నీట్ పరీక్ష రద్దుతో దేశవ్యాప్తంగా లక్షలాది వైద్య విద్యార్థులపై ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. పేపర్ లీక్ కు ఎవరు బాధ్యులో బాధ్యత వహించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. NTA నీట్ వైఫల్యం అనంతరం విద్యార్థుల ఆత్మహత్యలు వెలుగులోకి వచ్చాయి.
