హైదరాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి చావుబతుకుల్లో ఉన్న ఒక విద్యుత్ కార్మికుడి ప్రాణాలను కాపాడారు. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. అసిస్టెంట్ లైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న రాజు నాయక్ అనే విద్యుత్ కార్మికుడు, ఓ స్తంభంపై ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ హైటెన్షన్ వైర్ తగిలింది. తీవ్రమైన కరెంట్ షాక్‌కు గురైన ఆయన... ఒక్కసారిగా పైనుంచి కిందపడిపోయారు. షాక్ తీవ్రతకు రాజు నాయక్ గుండె స్పందన ఆగిపోయింది, ఒళ్లంతా స్పృహ తప్పి పడిపోయారు.
ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న టప్పాచబుత్రా పోలీస్ కానిస్టేబుల్ సురేష్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే రాజు నాయక్‌కు సీపీఆర్ (CPR) చేయడంతో కొద్దిసేపటికే రాజు నాయక్ తిరిగి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం రాజు నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
కానిస్టేబుల్ సురేష్ సకాలంలో చేసిన సీపీఆర్ వల్లే రాజు నాయక్‌కు ప్రాణాపాయం తప్పిందని, లేదంటే ఊపిరి దక్కేది కాదని వైద్యులు ప్రశంసల వర్షం కురిపించారు. విధి నిర్వహణలో అసాధారణ సమయస్ఫూర్తిని చూపి, ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన కానిస్టేబుల్ సురేష్‌ను ఉన్నతాధికారులతో పాటు ప్రజలు కూడా రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు.
