విద్యుత్ డిమాండ్ పీక్స్ కు..రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరెంట్ వినియోగం

 విద్యుత్ డిమాండ్ పీక్స్ కు..రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరెంట్ వినియోగం
  • ఆగస్టు 12న  15,835 మెగావాట్ల డిమాండ్​ 
  • గతేడాది  ఇదే రోజు కేవలం 10,787 మెగావాట్లు మాత్రమే!
  • ఎల్​నినో ఎఫెక్ట్​తో వానలు తగ్గడం, ఎండలు పెరగడం, వరి సాగే కారణమంటున్న ఎక్స్ పర్ట్స్
  • పెరుగుతున్న  డిమాండ్​ను తట్టుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న సీఎండీలు

హైదరాబాద్, వెలుగు: ఎల్​నినో ఎఫెక్ట్​తో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో విద్యుత్​ వినియోగం పీక్స్​కు చేరింది. పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు కరెంట్​ మోటర్లపై ఎక్కువగా ఆధారపడ్తుండడం, ఉక్కపోతతో ఇండ్లలో కూలర్లు, ఏసీల వాడకం పెరగడంతో కొద్దిరోజులుగా కరెంట్​ డిమాండ్ గత రికార్డులను తిరగరాస్తున్నది. వేసవికి దీటుగా ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్తంగా 15,835 మెగావాట్ల విద్యుత్​ డిమాండ్​ నమోదైంది. గతేడాది ఇదే రోజు కేవలం 10,787 మెగావాట్ల డిమాండ్​ మాత్రమే ఉన్నది. ఏడాది వ్యవధిలో ఏకంగా 5,048 మెగావాట్ల అధిక వాడకం నమోదుకావడం సరికొత్త రికార్డుగా విద్యుత్​ ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

ఎల్​నినో ఎఫెక్ట్​తో పెరుగుతున్న విద్యుత్​ డిమాండ్..​

ఎల్‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. ఎండల వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో గృహ విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఉక్కపోత వల్ల ఎండకాలం మాదిరిగానే ఏసీలు, కూలర్లు నడుస్తున్నాయి. పారిశ్రామిక, ఐటీ రంగాల్లోనూ విద్యుత్​ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతోంది. దీనికితోడు వర్షాలు లేక, ప్రాజెక్టుల నుంచి కాలువ నీరు రాక రైతులంతా బోర్లు, బావులపై ఆధారపడ్తున్నారు. 

ఎల్​నినో పరిస్థితుల్లో వరి సాగుచేయవద్దని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ముందు నుంచీ చెప్తున్నా వేలాది రైతులు పెడచెవిని పెట్టారు. ఎప్పట్లాగే వరి సాగు చేయడంతో ఇప్పుడు పంట కాపాడుకునేందుకు బోర్లు, బావుల్లో నీళ్లున్నంత సేపు కరెంట్​ మోటార్లను నడిపిస్తున్నారు. దీంతో అగ్రికల్చరల్​ కరెంట్​ వినియోగం అంచనాలను మించిపోతున్నది.

 ఆగస్టు నెలలో భారీగా పెరిగిన డిమాండ్​..

ఆగస్టు నెల ప్రారంభం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్​ డిమాండ్​ భారీగా పెరుగుతోంది. ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్తంగా 15,835 మెగావాట్ల విద్యుత్ డిమాండ్​ నమోదుకాగా, గతేడాది ఇదే రోజు కేవలం 10,787 మెగావాట్ల డిమాండ్​ మాత్రమే ఉంది. ఏడాది వ్యవధిలో ఏకంగా 5,048 మెగావాట్ల అధిక డిమాండ్​ నమోదైంది. 

దక్షిణ డిస్కమ్​ పరిధిలో 3,623 మెగావాట్లు, ఉత్తర డిస్కమ్​ పరిధిలో 1,421 మెగావాట్లు ఎక్కువ డిమాండ్​ రికార్డు కావడం గమనార్హం.  విద్యుత్ వినియోగానికి వచ్చే సరికి గతేడాది ఆగస్టు 12న రాష్ట్ర వ్యాప్తంగా 208.07 మిలియన్​ యూనిట్లు ఉండగా ఈ సారి 283.26 మిలియన్​ యూనిట్లకు చేరుకున్నది. 

ఒక్క సదరన్​ డిస్కమ్​ పరిధిలోనే 60.18 మిలియన్ యూనిట్ల అదనపు కరెంట్​ వినియోగం నమోదైంది. కోర్​ అర్బన్​ ఏరియా(క్యూర్​) పరిధిలో ఈ ఏడాది ఆగస్టు 12న 3,920 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదుకాగా, గత ఏడాది ఇదే రోజున 3,310 మెగావాట్ల డిమాండ్​ మాత్రమే ఉన్నది. క్యూర్​ పరిధిలో విద్యుత్ వినియోగం 81.17 మిలియన్ యూనిట్లకు చేరగా, గత ఏడాది 65.49 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 15.68 మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగినట్లు దక్షిణ డిస్కమ్​ సీఎండీ జితేష్​ వి.పాటిల్​ ప్రకటించారు.

ఉత్తర డిస్కమ్​లో  ఆగస్టు 3న రికార్డు..

వరంగల్​ కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్​ డిస్కమ్​ పరిధిలో ఆగస్టు 3న అత్యధిక విద్యుత్​ డిమాండ్​, వినియోగం నమోదైంది. గతేడాది ఆగస్టు 26న 5,655 మెగావాట్ల విద్యుత్​ డిమాండ్​ ఉండగా ఈ సారి ఆగస్టు 3న ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఆ రోజు 6,198 మెగావాట్లు నమోదైనట్లు డిస్కమ్​ సీఎండీ వరుణ్​ రెడ్డి ప్రకటించారు. 

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్​కు అనుగుణంగా అదనపు లోడ్‌‌ను భరించేలా సబ్‌‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌‌ఫార్మర్లు, ఫీడర్లను బలోపేతం చేయడంతో పాటు అత్యవసర బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచుతూ, కీలక ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపడ్తున్నామని ఇరువురు సీఎండీలు చెప్తున్నారు.