రెడ్, గ్రీన్, ఎల్లో.. ఏ రంగు పండ్లు, కూరగాయలు తింటే ఏం లాభమో తెలుసా ?

రెడ్, గ్రీన్, ఎల్లో.. ఏ రంగు పండ్లు, కూరగాయలు తింటే ఏం లాభమో తెలుసా ?

రకరకాల రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్ని చూడగానే తినబుద్ది అవుతుంది. రుచి, వాసన బాగుంటే వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. భోజనంలో వీటిని చేర్చుకుంటే శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఇమ్యూనిటీ పెరిగి, ఆరోగ్యంగా  ఉంటారని అంటున్నారు ఆయుర్వేద ఎక్స్ పర్ట్స్. పండ్లు, కూరగాయలు రంగుల్లో కనిపించడానికి కారణం... వాటిలోని ఫైటోన్యూట్రియెంట్లు. ఇవి తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. రంగుని బట్టి వాటిలోని పోషకాలు మారుతాయి. ఏ రంగులో ఏమేం ఉంటాయంటే...

ఎరుపు
ఈ రంగు కూరగాయలు, పండ్లలో లైకోపిన్, ఆంథోసైనిన్ అనే ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. అందుకని ఎరుపు రంగులో ఉండేవి తింటే గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇవి శరీరంలోని కణాల్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అంతేకాదు రక్తప్రసరణ కూడా మెరుగ్గా జరుగుతుంది. 

ఆకుపచ్చ
వీటిలో ఐరన్, విటమిన్లు ఎక్కువ. ఆకుపచ్చ రంగు కూరగాయలు, పండ్లలో క్యాన్సర్ ని అడ్డుకునే కెమికల్స్ ఉంటాయి. ఇవి గుండెని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరంలోని హార్మోన్లని బ్యాలెన్స్ చేస్తాయి. ఇందులోని 'క్యాటెచిన్' అనే యాంటీ ఆక్సిడెంట్ ఇమ్యూనిటీని పెంచుతుంది. 

నీలం, పర్పుల్ 
ఈ రంగు పండ్లు, కూరగాయలు తింటే పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఆంథోసైనిన్ అనే ఫైటోన్యూట్రియెంట్ వల్ల ఇవి నీలం, ఊదా రంగులో కనిపిస్తాయి. ఇవి తింటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

పసుపు, ఆరెంజ్ 
విటిలో యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. వీటిలోని కర్క్యుమినాయిడ్స్ కారణంగా పసుపు రంగులో కనిపిస్తాయి. ఇందులోని బీటా కెరోటిన్ అనే ప్రోటీన్ జుట్టు, గోళ్లు, కండరాల్ని ఆరోగ్యంగా, బలంగా చేస్తుంది. పసుపు, ఆరెంజ్ రంగు పండ్లు, కూరగాయలు తింటే ఆలోచనా శక్తి పెరుగుతుంది.

తెలుపు, గోధుమ
ఈ రంగున్న పండ్లు, కూరగాయల్లో అల్లిసిన్ అనే సల్ఫోరైడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలు రాకుండా చూస్తుంది. ఇవి తింటే కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.