
- జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లుంటయ్
- ఏ ఒక్కరి కోసమో వర్గీకరణ చేయం
- పంచుతం.. పంచాయతీ తెంచుతమనేదే తమ నినాదం
- టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీలను వర్గీకరిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వర్గీకరణ ఏ ఒక్కరి కోసమో కాకుండా ప్రజల కోసం చేస్తామని చెప్పారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. రెండు వర్గాల్లో వున్న జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేస్తామని తెలిపారు.
శంకిచాల్సిన అవసరం లేదు
వర్గీకరణ పట్ల కాంగ్రెస్ చిత్త శుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదన్నారు. ఒకరికి మద్దతు ఇచ్చి ఇంకోరిని ప్రశ్నించడం సరికాదని, రాహుల్ గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై పంచుతం, పంచాయితీ తెంచుతం ఇదే తమ పార్టీ నినాదమని పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర సర్కార్ వచ్చిన మొదటి టర్మ్ లోనే అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయకుడు హామీ ఇచ్చారి, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో కేవలం రిజర్వుడ్ సీట్లలోనే కాకుండా జనరల్ సీట్ల లోనూ దళిత, గిరిజనులకు అవసరం మేరకు టికెట్లిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమలయ్యే ఫార్ములాలు తెలంగాణాలో అమలు చెయ్యబోమని, ఇక్కడి పరిస్థితి ఆధారంగా పాలసీలుంటాయన్నారు. ఆర్మూర్ నుంచి బీజేపీ నేత వినయ్ రెడ్డి త్వరలో పార్టీలో చేరనున్నారన్నారు. చేవెళ్ల సభ ను వాయిదా వేస్తున్నామని, 24న సభ ఉండొచ్చని చెప్పారు. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు.