వెలుగు ఓపెన్ పేజీ : మోదీ అలా! రాహుల్ ఇలా! 

వెలుగు ఓపెన్ పేజీ : మోదీ అలా! రాహుల్ ఇలా! 

ఆ మధ్య  ఓ సర్వే సంస్థ దేశంలో బీజేపీకి సుమారు 45 శాతం మంది హిందువులు ఓటేస్తున్నారని వెల్లడించింది. మోదీ చరిష్మా కావచ్చు. కొంత అయోధ్య మందిరం కావచ్చు.  దేశానికి ఒక బలమైన నాయకుడు అవసరం అని కావచ్చు. దేశంలో రాజకీయ సుస్థిరత ఉండాలని కావచ్చు.   మొత్తం మీద 2014 నుంచి అప్రతిహతంగా దేశాన్నేలుతున్న పార్టీ బీజేపీ. ఆ పార్టీ పెద్దలు అపుడపుడు ఏమని చెపుతుంటారంటే..  భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అని. నిజమే కావచ్చు. కానీ   ప్రజలకు ‘మనం తప్ప మరొక పార్టీ దిక్కులేదు’ అనే అహభావం పెంచుకున్నపుడు అది వారికే కాదు, దేశానికే అదొక సమస్యగా మారుతుంది.  

ఎన్ని వరుస గెలుపులు సాధించినా.. ఈ మధ్య ప్రధాని  మోదీకి  వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయి. అయోధ్యలో  జరిగిన అక్రమాలు రాజ కీయంగా  మోదీని  అప్రతిష్ఠకు గురిచేసే సమస్య. అలాగే, నీట్​ పరీక్ష పేపర్ లీక్‌‌పై జరిగిన సంఘటనలు,  ర్యాలీలు ఒక రకంగా ఢిల్లీనే వణికించిన సమస్య.  ఇలాంటి వరుస సంఘటనలు వాస్తవానికి బీజేపీని అంతర్గతంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే చెప్పాలి. ప్రజల విశ్వాసానికి కాపలాదారుగా పనిచేయాల్సిన చోట,  పేపర్​ లీకులు జరగడం, బొద్దింకల పార్టీ పుట్టుకు రావడం, జంతర్​ మంతర్​ వేదికగా మారడం, తమ పనితీరే, తమ వ్యతిరేక శక్తులకు ఆస్త్రాలుగా మారడం చూస్తే.. అవన్నీ స్వయంకృతాలే కదా! ఇందులో ప్రతిపక్షాల సమర్థత వల్లనే బీజేపీ వరుస సంఘటనలు ఎదుర్కొంటుందనే కన్నా.. బీజేపీ 
స్వయంకృతాలే  బీజేపీకి సమస్యలుగా మారాయంటేనే  బాగుంటుంది.

అయోధ్యలో అక్రమాలన్నీ తేలలేదు

అయోధ్య మందిర నిర్మాణం నుంచి మొదలుకుంటే, మందిరం కోసం భూముల కొనుగోలు దాకా అనేక ఆరోపణలు వచ్చాయి. ఐదేళ్లుగా చర్యలే లేవు. తాజాగా మందిర  విరాళాల దోపిడీ బయటపడింది. ఓ ఎనిమిది మందిపై కేసు నమోదయింది. కానీ మందిర నిర్మాణ కాలం నుంచి జరిగిన అక్రమాల జోలికి మాత్రం  వెళ్లలేదు.   మేం ఏం చేసినా  హిందువులంతా నమ్ముతారనే ధీమానే  కదా!  కంచే చేను మేస్తే.. ధర్మం అధర్మ మార్గం పడుతున్నదని ప్రజలకు అనుమానాలు పెరిగితే అది అహంభావ స్వయం
కృతం తప్ప,  అందుకు రాహుల్​ గాంధీయో, మరెవరో కారణం కాదు కదా!  ప్రజల విశ్వసం దెబ్బతినకుండా   ఎవరు చూసుకోవాలో వారే ఆలోచించాలి మరి!

అప్పుడే చేసి ఉంటే..

నీట్​ పేపర్​ లీక్​ అయిన కాలంలోనే  సంబంధిత మంత్రి చేత రాజీనామా చేయించి, అతనికి మరోశాఖ ఇచ్చి ఉంటే కథ  ఇంతదాకా  వచ్చేది కాదేమో! నైతికత ఆధారంగా మంత్రి చేత రాజీనామా అప్పట్లోనే చేయించి ఉంటే.. మోదీ ప్రతిష్ఠ కొంత పెరిగేదే తప్ప తగ్గేది కాదు! అందుకు కారణం మళ్లీ అదే చెప్పాల్సివస్తోంది .. ప్రజలకు తాము తప్ప మరొకరు దిక్కు లేరనే అహంభావమే అందుకు కారణమై ఉంటుందని!

వ్యవస్థలు ఎలా ప్రవర్తిస్తున్నాయి?

ఆయా వ్యవస్థల్లో  బాగా పనిచేసేవారు ప్రధాని మెప్పు పొందితే తప్పు కాదు. కానీ కొందరు ఆ మెప్పు కోసమే అన్నట్లు  చేసే పనులు మోదీకి మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నాయోమో తెలియదు. ఒక సుప్రీంకోర్టు జడ్జి యువతపై చేసిన కామెంట్​ను ఆధారం చేసుకొని కాక్రోచ్​ జనతాపార్టీ పుట్టుకురావడం గమనార్హం. కాక్రొచ్​ జనతాపార్టీ అనేది ఎన్నికల కమిషన్​లో రిజిస్టర్​ అయిన పార్టీ కూడా కాదు. అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్​ఆర్​ఐ ఆ పార్టీ పేరు ప్రకటించుకుని ఇండియాకు వచ్చి,  నీట్​  పేపర్​  లీక్​పై ధర్నా 

చేపట్టడం భారత రాజకీయాల్లో ఒక విచిత్ర 

సంఘటనే !  ఒకరు చేసిన  కామెంట్​ కారణంగా పుట్టుకొచ్చిన  కాక్రోచ్​ పార్టీయే  దీక్ష చేయడం .. ప్రభుత్వాన్నే వణికించడం మోదీయే ఆలోచించాల్సిన విషయం!  జంతర్​ మంతర్​ లో జరిగిన ‘ఆందోళనల వీడియోలు చూడడానికి మాకు టైం లేదు’ అని  అదే జడ్జీ చేసినవ్యాఖ్య ఎవరికైనా విస్మయాన్ని కలిగిస్తుంది. సుప్రీం జడ్జి నుంచి అలాంటి వ్యాఖ్యను ఎవరూ ఊహించలేకపోయారు! వ్యవస్థలు రాజు మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాయా అని అనుమానించడం ప్రజల వంతవుతోంది!  ఫలితంగానే, తమ ప్రతిష్టకు నష్టం జరిగే పరిస్థితి వస్తోందని  మోదీ  గమనిస్తున్నారా? 
గెలుపులు అహంభావాన్ని పెంచుతున్నాయా! 

అప్రతిహత గెలుపులు ధీమాను పెంచితే మంచిదే. నిరంతరం ఆ ధీమాను  నిలుపుకునే దిశగా పని చేస్తూ పోతున్నామా లేదా అనేది వెనక్కి తిరిగి చూసుకోవాలి!  గెలుపులను తిరుగులేని అహంభావంగా మార్చుకుంటేనే సమస్యలు ఎదురవుతుంటాయి. ఇపుడు ప్రధాని మోదీకి ఎదురవుతున్నవి ఆ సమస్యలే.  వాటి నుంచి బయటపడటం మోదీకి సమస్య కాకపోవచ్చు. కానీ, ప్రజలకు మేం తప్ప మరొకరు దిక్కులేరు అనే ధోరణి నుంచి  బీజేపీ బయటపడితేనే.. పేపర్​ లీకులు, అయోధ్య అక్రమాలు తమను ప్రజలకు దూరం చేస్తున్నాయా  లేదా  అనేది  అర్థమవుతుంది.

ప్రధాన ప్రతిపక్షానికి వ్యూహాత్మక రాజకీయం పట్టదా?

ప్రధాన ప్రతిపక్ష నేత సమర్థత కొరత మోదీకి కలిసొస్తున్న అంశమని అనేకమంది సెఫాలజిస్టులు చెపుతున్నారు. దేశంలో మెజారీటీ (హిందువుల) పల్స్​ను కట్టడి  చేసుకున్న  బీజేపీని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షం వద్ద ఏదైనా వ్యూహాత్మక రాజకీయం ఉందా? రాజ్యంగ పుస్తకం  చేపడితే  మాత్రమే ప్రత్యామ్నాయం అయిపోరు! రైటిజానికి..  లెఫ్టిజమో, సెంట్రలిజమో ప్రత్యామ్నాయం అయ్యేకాలం కాదిది!  అధికార పక్షంలో.. ‘మాకు తిరుగులేదు’ అనే ధోరణి ఎందుకు పెరిగిపోయిందో గుర్తించి, దానికి తగిన రెమెడీ రాజకీయం చేస్తే తప్ప ప్రత్యామ్నాయం కాలేరు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది  నెహ్రూకాలం కాదు. ‘మెజారీటీల’ అంశం దేశ రాజకీయాల్లో  గత రెండు దశాబ్దాలుగా అనివార్యంగా మారిపోతూ వచ్చింది. ప్రస్తుతం మోదీలోగానీ, బీజేపీలోగానీ, మేం తప్ప దిక్కులేదు అనే ధీమా పెరగడానికి అదే కారణం! దాన్ని ఛేదించాలంటే.. మెజారిటీ భావాన్ని అంటరాని అంశంగా చూడటం మానేసి, కాస్త సాఫ్ట్​ మెజారిటీ రాజకీయం చేయడం కూడా రాహుల్​ లాంటి ప్రతిపక్ష నేతకు అవసరం.  అయోధ్య అక్రమాలను దేశంలో ఒక్క ప్రతిపక్షం కూడా బలంగా ప్రజెంట్​ చేయలేకపోవడాన్ని మనం గమనించొచ్చు! అదే కదా మాకు ‘తిరుగులేదు’ అనే బీజేపీ ధీమాకు కారణం. 


మొత్తంమీద  రాజకీయ సుస్థిరత కోసం దేశానికి రెండు బలమైన జాతీయ పార్టీల అవసరం  ఉంది. ఒకటి బలంగా, మరొకటి బలహీనంగా ఉండడం వల్లనే అయోధ్య అక్రమాలైనా, పరీక్ష పేపర్​ లీక్​లైనా జరిగిపోతున్నాయి. ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులు.. ప్రతిపక్షనేత విదేశీ యాత్రలు తగ్గించుకొని ‘ఫుల్​ టైమ్​ అపోజిషన్​ లీడర్’ ​గా పనిచేయాలని మాత్రం చెపుతున్నాయి!

మోదీకి వరుస సంఘటనలు

దేశంలో  కేవలం మోదీ వల్లే  బీజేపీకి 32 శాతం మంది ఓటేస్తున్నారని  ఓ  సర్వే చెపుతోంది. దేశానికి బలమైన నాయకుడు అవసరమనే ప్రజల  ఆపేక్ష వల్లనే  మోదీ పాపులరయ్యారు. కానీ అది వ్యక్తిగతం అనుకుంటే పొరపాటు. దేశానికి  బలమైన నాయకుడు ఎంత అవసరమో,  ఆ నాయకుడు ప్రజల విశ్వాసాన్ని కాపాడడం కూడా అంతే అవసరం. ఇప్పటి కిప్పుడు  మోదీ  పాపులారిటీకి  వచ్చిన ప్రమాదమేమీ  లేకపోవచ్చు.  కానీ  వరుస సంఘటనలు ఆయన నాయకత్వంపై ప్రజల్లో ఎంతో కొంత చర్చకు  దారితీయడానికి కారణమవుతున్నాయి.  వీలైతే స్వయాన మోదీయే ఆలోచించుకోవాల్సిన విషయం ఇది.

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి
సీనియర్​ జర్నలిస్ట్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.