లాభాలు సర్కారుకు మళ్లించిన సింగరేణి..?

లాభాలు సర్కారుకు మళ్లించిన సింగరేణి..?
  • రూ.1500 కోట్ల దాకా  లాభాలు వచ్చాయని అంచనా
  • గతేడాది వార్షిక లాభాల్లో కార్మికులకు 29శాతం వాటా
  • సర్కారుకు మళ్లించడం వల్లే ప్రకటన చేయట్లేదనే అనుమానాలు
  • ఇటీవలి సీఎం ప్రకటనలపైనా మండిపడ్తున్న కార్మిక సంఘాలు
  • ఆర్థిక సంవత్సరం ముగిసి 4 నెలలైనా లాభాలు ప్రకటించలే..    

భద్రాద్రి కొత్తగూడెం/ మందమర్రి, వెలుగు: అసలే అప్పుల్లో కూరుకపోయిన రాష్ట్ర సర్కారు, సింగరేణి లాభాలను తన అవసరాలకు వాడుకుంటున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. వచ్చిన లాభాలను ప్రభుత్వానికి మళ్లించిన యాజమాన్యం, నాలుగు నెలలుగా ఆ డబ్బు సర్దుబాటు కాకపోవడం వల్లే  వార్షిక లాభాలపై ప్రకటన చేయడం లేదనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చాలదన్నట్లు రామగుండంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి సింగరేణి నుంచి రూ.500 కోట్లు ఇస్తామని సర్కారు చెప్పడం, ఇటీవల గోదావరి వరద బాధితులకు సింగరేణితో కలిసి రూ.వెయ్యి కోట్లు సాయం చేస్తామని సీఎం ప్రకటించడంపై కార్మిక సంఘాలు మండిపడ్తున్నాయి.

2021–22 ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగడంతో తక్కువలో తక్కువ రూ.1500 కోట్ల దాకా లాభాలు వచ్చి ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. గతేడాది లాభాల్లో కార్మికులకు యాజమాన్యం 29శాతం వాటా ఇచ్చింది. ఈసారి కూడా అదే స్థాయిలో ఇచ్చినా కార్మికుల వాటాగా రూ.435 కోట్ల దాకా వస్తుంది. కానీ ఇప్పటివరకు లాభాలే ప్రకటించకపోవడంతో తమ వాటా వస్తుందో రాదో తెలియక కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 

యేడాదంతా  సిరులే.. 
రూ.1500 కోట్ల లాభాలపై ఆశలు

2021–22 ఆర్థిక సంవత్సరంలో  సింగరేణి  బొగ్గు ఉత్పత్తి టార్గెట్​ను దాదాపు చేరుకోవడంతో పాటు అమ్మకాల్లోనూ రికార్డు నెలకొల్పొంది. మొదటి అర్థ సంవత్సరంలోనే రూ.11,920 కోట్ల విలువైన బొగ్గు, విద్యుత్​అమ్మిన కంపెనీ, తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి రూ.19వేల కోట్ల అమ్మకాలు చేసింది. సింగరేణి సంస్థ గతంలో ఎప్పుడు కూడా ఈస్థాయిలో  ప్రతి నెలా లాభాలను సాధించిన సందర్భాలు లేవు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికే సుమారు రూ.650 కోట్ల వరకు లాభాలను సంస్థ ఆర్జించింది. ఆరో నెల నుంచి ప్రగతి పథంలో దూసుకెళ్లింది. సంస్థకు బొగ్గు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడం, దేశంలో బొగ్గు కొరత ఏర్పడటంతో సింగరేణిపై వినియోగదారుల నుంచి ఒత్తిడి పెరిగింది.

కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గడిచిన ఏడాది వినియోగదారులు బొగ్గు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుతో పాటు మహారాష్ట్రలోని విద్యుత్​ కేంద్రాలకు సింగరేణి బొగ్గు రవాణా చేసింది. అక్టోబర్​ నాటికి  అమ్మకాలు రూ.14,067 కోట్ల కు చేరగా,  లాభాలు రూ.868 కోట్లకు చేరాయి. నవంబర్​లో అమ్మకాలు  రూ.16,512 కోట్లకు చేరగా,  రూ.924 కోట్ల లాభాలు, డిసెంబర్​లో అమ్మకాలు రూ.19,000 కోట్లకు, లాభాలు  రూ.1,070 కోట్లకు చేరాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రకటించారు.  మార్చి నాటికి అమ్మకాలు(టర్నోవర్​) రూ.26వేల కోట్లకు చేరగా, లాభాలు రూ.1500 కోట్లకు చేరాయనే అంచనా ఉంది.

నిజానికి  2020–21 ఆర్థిక సంవత్సరం 50.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తే  28.6శాతం వృద్ధితో 2021–22 ఆర్థిక సంవత్సరం సింగరేణి చరిత్రలో రికార్డు స్థాయిలో 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.  అంతకుముందు ఏడాది 48.5 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసిన సంస్థ 2021–22లో   ఏకంగా 35.1శాతం వృద్ధితో  65.5 మిలియన్ టన్నుల కోల్ ట్రాన్స్​పోర్ట్​ చేసింది. 2020–21లో 17,669 కోట్ల అమ్మకాలు జరిపితే గడిచిన ఏడాది 26వేల కోట్ల టర్నోవర్ సాధించింది.   

తొమ్మిది నెలలపాటు లాభాలు ప్రకటించి, తర్వాత ఆపేశారు.. 

సింగరేణి ఏటా సాధించిన లాభాల్లో కొంత వాటాను  కార్మికులకు చెల్లించడం దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక సంవత్సరం చివర్లో  సింగరేణి సీఎండీ సీఎంతో చర్చించాక కంపెనీ సాధించిన లాభాలు, అందులో కార్మికుల వాటాకు సంబంధించి ప్రకటన చేస్తారు. 2020–21 ఆర్థిక సంవత్సరం కొవిడ్ ఎఫెక్ట్​ కొనసాగుతున్న సమయలోనూ కంపెనీ రూ. 273 కోట్ల లాభాలను సాధించింది. ఇందులో 29 శాతం కార్మికులకు లాభాల వాటాగా యాజమాన్యం ప్రకటించి, పంపిణీ చేసింది. ఈసారి రూ.1500 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు తెలుస్తున్నా అధికారికంగా లాభాల ప్రకటన చేయడం లేదు.

వాస్తవానికి త్రైమాసిక, అర్ధ సంవత్సరం టర్నోవర్, వృద్ధి, లాభాలను ప్రకటించిన యాజమాన్యం వార్షిక లాభాలను ప్రకటించడంలో జాప్యం చేయడం వెనుక నిధుల మళ్లింపే ప్రధాన కారణమని కార్మిక సంఘాల లీడర్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలకు సంబంధించిన  టర్నోవర్, లాభాల్లో సాధించిన వృద్ధి తదితర విషయాలను మూడు నెలలకు ఒక్కసారి ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వచ్చిన సింగరేణి సీఎండీ శ్రీధర్ కార్మికుల్లో ఆశలు రేపారు. తీరా ఆర్థిక సంవత్సరం  చివరి మూడు నెలలతో పాటు వార్షిక లాభాలను ప్రకటించలేదు. ఏ పరిశ్రమ అయినా వార్షిక సంవత్సరం ముగియగానే లాభాలను ప్రకటిస్తుంది. కానీ సింగరేణి సాధించిన లాభాలను రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించి,  ఆ డబ్బులను సర్దుబాటు చేసుకునే క్రమంలోనే లాభాల ప్రకటనలో యాజమాన్యం జాప్యం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి.  

35 శాతం వాటా ఇవ్వాలె
వాస్తవ లాభాలను యాజమాన్యం ప్రకటించాలి. కంపెనీ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సింగరేణి నుంచి నిధులను తీసుకోవడంతో వాటిని సర్దుబాటు చేయడంలో ఇబ్బంది కలుగుతోంది. కంపెనీ వాస్తవ పరిస్థితిపై వైట్​ పేపర్​ రిలీజ్​ చేయాలి. కార్మికులకు లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలి.  -  పి. మాధవ్ నాయక్, జాతీయ కార్యదర్శి, బీఎంఎస్