- ఫొటోలతో కూడిన ప్రింటెడ్ ఎన్యుమరేషన్ ఫామ్లలో వివరాల నమోదు
- రాష్ట్రంలో 68 శాతం పూర్తయిన ప్రీ-సర్ మ్యాపింగ్
- ఆన్లైన్లోనూ వివరాల నమోదుకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షా ళనకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియ గురువారం నుంచి క్షేత్రస్థాయిలో షురూ కానుంది. దాదాపు 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ ప్రత్యేక ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియ జులై 24 వరకు నెల రోజుల పాటు నిరంతరాయంగా సాగ నుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3.39 కోట్లకు పైగా మంది ఓటర్ల వివరాలను సరిచూసేందుకు 35,985 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) రం గంలోకి దిగుతున్నారు.
ప్రతి ఇంటికీ వెళ్లనున్న అధికారులు.. ఫొటోలతో కూడిన ప్రింటెడ్ ఎన్యుమరేషన్ ఫారాలను రెండు కాపీల్లో ఓటర్లకు అందజేస్తారు. ఇందులో ఒక ఫారంలో ఓటరు సంతకం లేదా బొటనవేలి ముద్రతో పాటు నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేసి వెనక్కి తీసుకోగా, రెండో ప్రతిని ఓటరుకు రశీదుగా ఇస్తారు. ఇంటి వద్ద ఓటరు అందుబాటులో లేకపోతే ఆన్‌లైన్ voters.eci.gov.in ద్వారా కూడా వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
మొత్తం మూడు దశల్లో సాగుతున్న ఈ ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఓటర్ల డేటాను 2002 నాటి ఓటర్ల జాబితాతో అనుసంధానించే అత్యంత కీలకమైన ప్రీ–సర్ మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు చేపట్టగా.. రాష్ట్రవ్యాప్తంగా 68.30 శాతం మ్యాపింగ్ పూర్తయింది. ఈ ఇంటింటి సర్వే ముగిసిన అనంతరం జులై 31న తుది డ్రాఫ్ట్ (ముసాయిదా) ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు.
ఈ జాబితాపై అభ్యంతరాలు, సవరణలు, కొత్త ఓటర్ల నమోదు (ఫామ్-6) లేదా తొలగింపుల (ఫామ్7) కోసం జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు గడువు ఇచ్చారు. అనంతరం ఓటర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను, క్లెయిములను సెప్టెంబర్ 28 లోగా పూర్తిగా పరిశీలించి, పరిష్కరిస్తారు. అన్ని సవరణలతో కూడిన అర్హులైన ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 1న అధికారికంగా విడుదల చేయనున్నారు.
