- ఉన్నతాధికారుల పరిశీలనలో బయటపడుతున్న నిర్మాణ లోపాలు
- భెల్ నుంచి కాంట్రాక్టులు దక్కించుకొని నాసిరకం పనులు
- కన్వేయర్ బెల్ట్, సీహెచ్‌పీ, ఏహెచ్‌పీ పనుల్లో నో క్వాలిటీ
- తరచూ నిలిచిపోతున్న యూనిట్లు.. తగ్గుతున్న విద్యుదుత్పత్తి
- ఆరున్నర నెలల్లో 7,700 మిలియన్ యూనిట్లకు 4,600 మి.యూ మాత్రమే
- 40 శాతానికి పైగా ఉత్పత్తి లోటు.. ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఆశించిన స్థాయిలో విద్యుదుత్పత్తి జరగకపోవడానికి సబ్ కాంట్రాక్టర్లు చేపట్టిన నాసిరకం పనులే ప్రధాన కారణమని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్లాంట్‌ను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల విచారణలో నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. భెల్ నుంచి సబ్ కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు నాసిరకంగా పనులు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొగ్గు సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ), యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఏహెచ్‌పీ)తో పాటు ఇతర పనుల్లో లోపాల వల్ల యూనిట్లు తరచూ నిలిచిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రభావంతో గత ఆరున్నర నెలల్లో 7,700 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యానికి గాను 4,600 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయి 40 శాతానికి పైగా లోటు ఏర్పడిదంటూ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
రూ.29 వేల కోట్ల నుంచి రూ.37 వేల కోట్లకు
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపల్లిలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు యూనిట్లతో మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యమున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. 2017లో రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం రూ.37 వేల కోట్లను దాటింది. టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) పలు పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే, బొగ్గు సరఫరా వ్యవస్థ, సీహెచ్‌పీ, ఏహెచ్‌పీ నిర్మాణాల్లో నాణ్యత లోపించినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం 800 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లలో, మొత్తం 3,200 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఐదో యూనిట్ పనులు పెండింగ్‌లో ఉండటంతో అది ఇంకా ప్రారంభం కాలేదు.
40 శాతానికి పైగా తగ్గిన ఉత్పత్తి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గడంతో జల విద్యుదుత్పత్తి రోజుకు 4,000 మెగావాట్ల మేర పడిపోయింది. దీంతో థర్మల్ విద్యుత్‌పైనే రాష్ట్రం ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్నది. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత నేపథ్యంలో థర్మల్ ప్లాంట్లలో నిరంతర ఉత్పత్తి కీలకంగా మారింది. ఈ పరిస్థితుల్లో యాదాద్రి ప్లాంట్‌లో ఉత్పత్తి తగ్గడం రాష్ట్ర విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపుతున్నది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వివరాల ప్రకారం, గత ఆరున్నర నెలల్లో 7,700 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యానికి గాను 4,600 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. అంటే 40 శాతానికి పైగా లోటు ఏర్పడింది.
నాసిరకం పనులతో తరచూ బ్రేకులు
ప్లాంట్‌లో నాలుగు యూనిట్లు ప్రారంభమైనా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరగడం లేదు. ఇప్పటి వరకు ఒక రోజు నాలుగు యూనిట్ల నుంచి కలిపి అత్యధికంగా 2,100 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే సాధించినట్లు సమాచారం. సీహెచ్‌పీలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కన్వేయర్ వ్యవస్థ డిజైన్లలో లోపాల వల్ల బొగ్గు అందుబాటులో ఉన్నా, దాన్ని యూనిట్లకు పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోతున్నారు. వ్యాగన్ టిప్పర్ల నుంచి క్రషర్లకు, అక్కడి నుంచి మెయిన్ స్టాక్ యార్డుకు బొగ్గును తరలించే బెల్టులతో పాటు, స్టాక్ యార్డు, క్రషర్ హౌస్ నుంచి యూనిట్ల కోల్ బంకర్లకు బొగ్గును చేరవేసే లైన్లలోనూ సమస్యలు వస్తున్నాయి. దీంతో బొగ్గు సరఫరాకు అంతరాయం ఏర్పడి యూనిట్లు నిలిచిపోతున్నాయి. బాయిలర్లు, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ల నుంచి బూడిదను సేకరించే హాప్పర్లు, అక్కడి నుంచి ప్లాంట్ వెలుపల ఉన్న యాష్ పాండ్‌కు తరలించే పైప్లైన్లు, పంపింగ్ వ్యవస్థల్లోనూ తరచూ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. నాసిరకం మెటీరియల్ వినియోగం, నిర్మాణ లోపాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ పనులన్నీ సబ్ కాంట్రాక్టర్ల ద్వారానే చేయించినట్లు విచారణలో తేలింది. జెన్కో ఇంజినీర్లు సైతం లోపాలను పట్టించుకోకుండా బిల్లులు చెల్లించారనే ఆరోపణలున్నాయి. నిర్మాణ దశలోనే నాణ్యతను పర్యవేక్షించకపోవడం వల్ల ఇప్పుడు ప్లాంట్ పనితీరుపై ప్రభావం పడుతున్నదని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
