యాసంగి సాగు అంచనా 70 లక్షల ఎకరాలట!

యాసంగి సాగు అంచనా 70 లక్షల ఎకరాలట!
  • కరువులోనూ వ్యవసాయశాఖ భారీ అంచనాలపై విస్మయం
  •     సాధారణ విస్తీర్ణం 68.67 లక్షల ఎకరాల కన్నా ఇదే అధికం
  •     ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించే యత్నం
  •     ఆరు రకాల పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు
  •     సబ్సిడీ విత్తనాల పంపిణీ, తక్కువ నీటితో సాగుపై అవగాహన
  •  

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సాగుపై వ్యవసాయ శాఖ తీరు విస్తుగొలుపుతున్నది. ఎల్‌‌‌‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో నీటి లభ్యతపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. పంటలు వేయొద్దని, వరి అసలే వద్దని సీఎం సహా మంత్రులందరూ చెప్తున్నప్పటికీ ఈసారి 70 నుంచి 75 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. నిరుడు యాసంగిలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో ఏకంగా 92.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈసారి రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గడం, భూగర్భజలాలు అడుగంటడాన్ని బట్టి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అయినప్పటికీ నిరుడు కంటే కేవలం 15 నుంచి 20 లక్షల ఎకరాలే తక్కువగా సాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వరికి బదులు తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఇతర ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించేలా వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

నిరుడు మక్క, జొన్న సాగు..

వరికి ప్రత్యామ్నాయంగా గత యాసంగిలో మక్క సాగు గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో మక్క సాధారణ సాగు విస్తీర్ణం 6.45 లక్షల ఎకరాలు కాగా, నిరుడు 16.36 లక్షల ఎకరాల్లో సాగైంది. మరోవైపు జొన్న సాధారణ విస్తీర్ణాన్ని మించి నాలుగు లక్షల ఎకరాలకు చేరింది.  ఈసారి కూడా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని అధికారులు భావిస్తున్నారు. మొక్కజొన్న, జొన్నలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

 ఆరు రకాల పంటలకు ప్రోత్సాహకాలు..

పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును పెంచేందుకు విత్తనాల పంపిణీకి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. జాతీయ ఆహార నూనెల మిషన్‌‌‌‌ కింద వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమ పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ పంటల సాగు కోసం మొత్తం 51,225 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించి, 28,680.5 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసింది. ఈ పథకం కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.49.35 కోట్లు కేటాయించింది. పప్పుధాన్యాల స్వయం సమృద్ధి మిషన్‌‌‌‌ కింద శనగ, మినుములు, పెసర సాగును ప్రోత్సహించనుంది. ఈ మూడు పంటలను కలిపి 1,09,812 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన విత్తనాలను సిద్ధం చేస్తోంది. 21 జిల్లాల్లో విత్తనాల పంపిణీ, ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు, సాగు విస్తీర్ణం పెంపు, మినీ కిట్ల ద్వారా సబ్సిడీ విత్తనాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పథకం కోసం రూ.34.60 కోట్లు కేటాయించడం విశేషం. పంట, విత్తన రకం, సంబంధిత 
పథకం నిబంధనలను బట్టి సుమారు 50 నుంచి 75 శాతం వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది.

సాధారణ సాగు కంటే ఎక్కువగా అంచనాలు..

రాష్ట్రంలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 68.67 లక్షల ఎకరాలు. గత యాసంగిలో అనుకూల నీటి వసతి ఉండటంతో సాధారణ విస్తీర్ణాన్ని మించి 92.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాగు 65.42 లక్షల ఎకరాలకు చేరింది. సాధారణంగా యాసంగిలో 51.48 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా.. నిరుడు దాదాపు 14 లక్షల ఎకరాలు అదనంగా వరి సాగైంది. ఈసారి మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎల్‌‌‌‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు, సాగునీటి వనరుల్లో నీటి లభ్యతపై ఆందోళనలు రైతులను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో యాసంగి సాగు 50 లక్షల ఎకరాలు దాటకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ వ్యవసాయ శాఖ మాత్రం 70–75 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని భావిస్తున్నది. వాస్తవంగా ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయన్నది నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది.