
- ఎల్బీ స్టేడియం వేదిక.. ‘సామాజిక న్యాయ సమర భేరి’ పేరిట నిర్వహణ
- సభ కోసం హైదరాబాద్కు చేరుకున్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ‘సామాజిక న్యాయ సమర భేరి’ పేరుతో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల పార్టీ అధ్యక్షులతో పాటు ఇతర నేతలు ఇందులో పాల్గొననున్నారు. సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గురువారం సాయంత్రమే ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. కాగా, సభకు ముందు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, రాజకీయ సలహా కమిటీ సమావేశాలు ఉమ్మడిగా జరుగనున్నాయి. ఇందులోనూ ఖర్గే పాల్గొననున్నారు.
ఖర్గేకు ఘన స్వాగతం
‘సామాజిక న్యాయ సమర భేరి’ సభలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్వాగతం పలికారు. అనంతరం ఖర్గే బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. ‘జై బాపు, జై భీం, జై సంవిధాన్’ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా కొనసాగుతున్నదనేది వారిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి పదవులు ఆశించి కేబినెట్ లో చోటు దక్కని పలువురు ఎమ్మెల్యేలతో ఖర్గే భేటీ అయ్యారు. కొన్ని సామాజిక సమీకరణల వల్ల కొందరికి అవకాశం రాలేదని, మరికొందరికి ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయ సమీకరణ దృష్ట్యా ఇవ్వలేకపోయామని ఈ సందర్భంగా ఖర్గే వారికి చెప్పినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఖర్గేను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, రాంమోహన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు తదితరులు ఉన్నారు. కాగా, ఖర్గేను కార్మిక, మైన్స్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే గడ్డం వినోద్, వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ జానయ్య, విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ముందుగా గాంధీభవన్లో మీటింగ్కు
శుక్రవారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, రాజకీయ అడ్వయిజరీ కమిటీ సమావేశాలు ఉమ్మడిగా సాగనున్నాయి. ఇందుకోసం గాంధీభవన్ లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. లంచ్ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలకు చీఫ్ గెస్టుగా హాజరుకానున్న ఖర్గే.. ప్రధానంగా రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే దానిపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. లంచ్ అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్న ఖర్గే.. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు అటెండ్ అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల అధ్యక్షులతోపాటు మండల, జిల్లా కమిటీ అధ్యక్షులతో ఖర్గే నేరుగా మాట్లాడనున్నారు.
‘జై బాపు, జై భీం, జై సంవిధాన్’ ప్రోగ్రామ్ లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సభలు జరుగనున్నాయి. అయితే మొదటి సభ తెలంగాణలోనే జరగనుండడంతో దీనికి ప్రత్యేకత ఏర్పడింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 500 మందిని తరలించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సభకు కనీసం 40 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యేలా పీసీసీ ఏర్పాట్లు చేసింది. సభ కోసం ఎల్బీ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. వీఐపీల ఎంట్రెన్స్, ప్రత్యేక సీటింగ్, బారికేడ్ల ఏర్పాట్లు, భారీ సభా వేదిక, వాటర్ సౌకర్యం, ప్రత్యేక పార్కింగ్ స్థలం వంటి ఏర్పాట్లు చేపట్టారు. సభకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మొత్తం కేబినెట్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.