V6 News

షార్ట్‌‌ సర్క్యూట్‌‌, నాణ్యతలేని వైరింగ్ వల్లే.. 95 శాతం అగ్ని ప్రమాదాలు

షార్ట్‌‌ సర్క్యూట్‌‌, నాణ్యతలేని వైరింగ్ వల్లే.. 95 శాతం అగ్ని ప్రమాదాలు
  • ప్రమాదాల నివారణకు తెలంగాణ ఫైర్ సర్వీసెస్‌‌  యాక్ట్‌‌  చట్టానికి సవరణలు
  • ఫైర్‌‌‌‌ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్‌‌  వెల్లడి
  • ఈనెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఫైర్  సేఫ్టీ నింబంధనలు పాటించకపోవడం, షార్ట్‌‌ సర్క్యూట్‌‌ కారణంగానే 95 శాతం అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఫైర్   సర్వీసెస్‌‌  డీజీ విక్రమ్‌‌ సింగ్‌‌ మాన్  అన్నారు. పాత భవనాల్లో ఎలక్ట్రికల్‌‌  వైరింగ్‌‌ లో నాణ్యతా లోపాలు, ఓవర్‌‌‌‌ లోడ్​ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత అవసరాలు, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవరసరం ఉందన్నారు.

ఈ మేరకు  తెలంగాణ ఫైర్‌‌  సర్వీసెస్‌‌  చట్టం1999కి సవరణ చేయనున్నామని తెలిపారు. జాతీయ అగ్నిమాపక సేవా వారోత్సవాల సందర్భంగా వట్టినాగులపల్లిలోని ఫైర్ సర్వీసెస్‌‌  అకాడమీలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. టీజీ ఫైర్  సర్వీసెస్‌‌  డైరెక్టర్‌‌ ‌‌ నారాయణ రావు సహా అకాడమీ ఉన్నతాధికారులతో కలిసి వారోత్సవాల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా  విక్రమ్ సింగ్ మాన్  మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందిని స్మరించుకుంటూ ఏటా ఏప్రిల్‌‌ 14 నుంచి 20 వరకు సేవా వారోత్సవాలు జరుపుకుంటున్నామని
 వెల్లడించారు. 

ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం

నిరుడు జరిగిన అగ్ని ప్రమాదాల్లో 158 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి 10 మంది మృతి చెందారని డీజీ విక్రమ్ సింగ్ మాన్  తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి అగ్ని ప్రమాదాల నివారణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ‘సురక్షిత పాఠశాల, సురక్షిత ఆసుపత్రి, అగ్ని భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఐక్యంగా’ అన్న ఇతివృత్తంతో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా బహుళ అంతస్థుల భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ పటిష్టంగా ఉందో లేదో ఆడిట్‌‌  చేసేందుకు థర్డ్‌‌ పార్టీ ఫైర్‌‌ ఆడిటర్స్‌‌, ఇంటిగ్రేటర్స్‌‌  త్వరలోనే అందుబాటులోకి వస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై  ఇప్పటికే జీఓ జారీ చేశామని  పేర్కొన్నారు. 

ఫైర్ సేఫ్టీ నింబంధనలు పాటించకపోవడం, నాసిరమైన వైరింగ్‌‌ వల్లనే అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఫైర్ స్టేషన్లు, సిబ్బంది సంఖ్య మరింత పెరగాలిపెరుగుతున్న పట్టణీకరణ, అగ్నిమాపక అవసరాల దృష్ట్యా అగ్నిమాపక సిబ్బంది సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందనని డీజీ పేర్కొన్నారు.

సిబ్బందితో పాటు అత్యాధునిక పరికరాల కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 146 ఫైర్‌‌ స్టేషన్లు ఉండగా ఒక్కో స్టేషన్‌‌లో సగటున 8 నుంచి 10 మంది అదనపు సిబ్బంది అవసరమన్నారు. 

ఈ క్రమంలోనే మరిన్ని కొత్త ఫైర్‌‌ స్టేషన‍్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బహుళ అంతస్థుల భవనాల సంఖ్య పెరుగుతోందని, దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్‌‌  టవర్‌‌గా నిలవబోతున్న 72 అంతస్థుల భవనం ఘట్‌‌కేసర్‌‌లో త్వరలోనే నిర్మాణం కాబోతున్నదని వివరించారు.

ఇలాంటి భవనాల్లో అగ్ని ప్రమాదాల సమయంలో సహాయ చర్యలు చేపట్టేందుకు 104 మీటర్ల ఎత్తున్న బ్రాంటో స్కైలిఫ్ట్‌‌లను త్వరలోనే అందుబాటులోకి తేబోతున్నామని, అదేవిధంగా ఫైర్‌‌ పైటింగ్‌‌లో సర్వైలైన్స్‌‌  కోసం డ్రోన్ల వాడకానికి సబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉందని వెల్లడించారు.