
- ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది: మంత్రి సీతక్క
- వారి కోసం జిల్లాల్లో మైత్రీ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం సెక్రటేరియెట్‌లో మంత్రి సీతక్క ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ట్రాన్స్‌జెండర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, మహిళా, శిశు అభివృద్ధి సెక్రటరీ అనితా రామచంద్రన్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు చేస్తున్న విధులు అందరినీ సంతృప్తి పరిచాయని ఆమె అభినందించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ వర్గానికి అంగవైకల్య కోటా కింద ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో వారి కోసం మైత్రీ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని, ఇతర ప్రభుత్వ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.