జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి శివారులో ఓ థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు జగిత్యాల పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దాసరి అరుణ్ (25) అనే యువకుడు తన స్నేహితులు నీవేష్, అశ్విన్‌లతో కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు బావిలో పడిన వెంటనే నీవేష్, అశ్విన్ ఎలాగోలా ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు.
కానీ అరుణ్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో... ప్రమాదం జరిగిన తరుణంలో దాన్ని విప్పుకోలేకపోయాడు. దీంతో కారుతో పాటే బావి అడుగుభాగానికి వెళ్లిపోవడంతో ఊపిరాడక నీటిలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నుంచి కారును, అరుణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఒకవైపు స్నేహితులు బతికి బయటపడినా... సీట్ బెల్ట్ లాక్ అవ్వడం వల్లే అరుణ్ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
