కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను హీనంగా చూస్తున్నారు

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను హీనంగా చూస్తున్నారు
  • కలసి వచ్చిన పార్టీలతో కల్లాల వద్దకే వెళతాం: టీజేఎస్ చీఫ్ కోదండరామ్ 

హైదరాబాద్:  కొనుగోలు కేంద్రానికి వెళ్లిన రైతులను హీనంగా చూస్తున్నారని.. ఆత్మగౌరవం లేని మనుషఉల్లా చూస్తున్నారని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు కోదండరామ్ ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను  మనుషుల మాదిరిగా చూడాలని, గంటల తరబడి బారులు తీరి వేచి చూసే పరిస్థితి లేకుండా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు అండగా కలసి వచ్చే రాజకీయ పార్టీలు,  ప్రజా సంఘాలతో కలని ఈనెల 7వ తేదీ నుంచి రైతుల కల్లాల వద్దకే వెళ్లి పాలకులను ఎండగతామని ఆయన ప్రకటించారు. 
ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులు సాగు పనుల్లో కాకుండా ఎక్కడకు వెళ్లినా వేచి చూడాల్సి వస్తుండడం దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కల్లాల వద్ద ధాన్యం వర్షం పాలు కాకుండా.. మార్కెట్ కు తీసుకెళ్లేందుకు.. మార్కెట్లో ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని.. ఎదురు చూడాల్సి రావడం మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. రైతులు ధాన్యం తీసుకురాగానే తేమ శాతం చెక్ చేసుకుని టోకెన్ ఇచ్చి పంపించడం ద్వారా క్యూ పద్ధతిని నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. 
మిల్లర్లతో ప్రభుత్వం కుమ్ముక్కై దోచుకుంటున్నారు 
మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను దోచుకుంటోందని తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కలసి వచ్చే ప్రజా సంఘాలతో కలసి రైతుల కల్లాల వద్దకే వెళతామని ఆయన తెలిపారు. ఈనెల 7వ తేదీన సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం, న్యూడెమాక్రసీ, ఇంటిపార్టీ కలసి కల్లాల వద్ద ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. తరుగు పేరుతో కమీషన్లకు అలవాటై.. మిల్లర్లతో కలసి రైతులను దోపిడీకి అలవాటు పడ్డారని, దోపిడీ కారణంగానే ఆలస్యం చేస్తున్నారని కోదండరామ్ ఆరోపించారు.  ప్రభుత్వం ఇచ్చిన  జీవో ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనాలి, యాసంగిలో వేరే పంట పండదు కాబట్టి మొత్తం వడ్లను కొనాలన్నారు. కేంద్రం కూడా రాష్ట్రం ఏ బియ్యం ఇచ్చినా కొనాలని ఆయన డిమాండ్ చేశారు.