పాలమూరులో ఆదివాసీల అవస్థలు

పాలమూరులో ఆదివాసీల అవస్థలు
  • 2019లో పల్లె ప్రగతి పేరుతో పాత ఇండ్లను కూల్చేసిన సర్కారు
  • డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని హామీ.. ఎక్కడా ఒక్కటీ కట్టివ్వలే
  • పశువుల షెడ్లు, గుడిసెలు, శ్మశానాల్లోనూ కొందరి నివాసం
  • ప్రజావాణిలో ఎన్ని విజ్ఞప్తులు ఇచ్చినా పట్టించుకుంటలే

మహబూబ్‌‌నగర్ / నాగర్‌‌‌‌కర్నూల్, వెలుగు: చెంచుల విషయంలో రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వారి ఇండ్లు శిథిలావస్థకు చేరాయంటూ మూడేండ్ల కింద కూలగొట్టిన సర్కారు.. ఇప్పటిదాకా ఎక్కడా ఒక్కటీకట్టివ్వలేదు. ప్రభుత్వం ఇస్తామన్న డబుల్ బెడ్రూం ఇండ్ల సంగతేమో కానీ.. చెంచులు కనీసం నిలువ నీడ లేక అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లలో, పశువుల పాకల్లో నివాసం ఉంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం చిన్నాయిపల్లి గ్రామంలో 65 చెంచు కుటుంబాల్లో 240 మంది ఉన్నారు. వీళ్లకు1979లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లను కట్టించి ఇచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే నివాసం ఉంటూ, మహ్మదాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దుంపలు, తేనె, ఇతర అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 2019లో నిర్వహించిన పల్లె ప్రగతిలో ‘‘మీ ఇండ్లు పాడుబడినయ్. వాటిని కూల్చేసి కొత్తవి కట్టిస్తాం” అని ఆఫీసర్లు చెప్పారు.

రెండు రోజుల్లోనే ఇండ్లను మొత్తం కూల్చేసి, సాఫ్ చేసేశారు. వాటి స్థానంలో సర్వే నంబర్ 896లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని అప్పటి కలెక్టర్ హామీ ఇచ్చారు. నాటి డీఆర్‌‌‌‌వో ప్రొసీడింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. కానీ ఇంత వరకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టలేదు. చౌదర్‌‌‌‌పల్లిలోనూ ఇదే పరిస్థితి. 18 చెంచు కుటుంబాల ఇండ్లను కూల్చేసి ఇండ్లు కట్టివ్వలేదు. దీంతో ఆయా కుటుంబాలు కూల్చేసిన ఇండ్ల వద్దే గుడిసెలు వేసుకొని బతుకీడుస్తున్నాయి. పశువుల కొట్టాలు, మేకలు, గొర్ల షెడ్ల కింద గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. గాలి వానలకు గుడిసెలు ఎగిరిపోవడంతో కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస పోయాయి. మిగతా కుటుంబాలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుర్కోని వంపు వద్ద, కొన్ని కుటుంబాలు శ్మశానవాటికలోని బాత్​రూముల్లో పిల్లాపాపలతో నివాసం ఉంటున్నాయి. మహ్మదాబాద్ మండలం చిన్నాయిపల్లికి చెందిన గంగసాని పెంటమ్మ ఇంటిని కూడా 2019లో ఆఫీసర్లు కూల్చేశారు. కొత్త ఇల్లు కట్టిస్తామని ఆఫీసర్లు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కట్టియ్యలె. దీంతో ఆమెకు నిలువ నీడ లేదు. మేకలు, గొర్ల కోసం వేసిన పశువుల పాకలోనే తలదాచుకుంటున్నది. అందులోనే ఓ మూలకు వంట చేసుకొని తింటున్నది. రాత్రి జీవాల మధ్యనే నిద్రపోతున్నది. 

 

15 వేల చెంచు జనాభా
రాష్ట్రంలో సుమారు 15 వేల చెంచు జనాభా ఉంది. ఐటీడీఏ మున్ననూర్ పరిధిలోని నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని 25 మండలాల్లో 100 గ్రామపంచాయితీల పరిధిలో 172 చెంచు పెంటలు ఉన్నాయి. అత్యధికంగా నాగర్​కర్నూల్ జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో అచ్చంపేట, అమ్రాబాద్, పదర, బల్మూరు, లింగాల, ఉప్పునుంతల, కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి మండలాల్లో 111 చెంచు పెంటల పరిధిలో 2,569 కుటుంబాల్లో సుమారు 10 వేల మంది ఉంటున్నారు. నల్లమల అభయారణ్యంలోని కోర్ ఏరియాలో ఉండే 15 పెంటల్లోని 200 కుటుంబాలు తప్ప మిగిలిన వాళ్లంతా అడవి బయట కూలినాలి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అమ్రాబాద్ మండలంలోని కొల్లంపెంట, కొమ్మన్‌‌పల్లి, తాటి గుండాల చెంచు పెంటల్లో ఉంటున్న వారిని నాగరికులుగా మారుస్తామంటూ 1990లో అడవి బయటకు తరలించారు. అప్పటి ప్రభుత్వాలు కట్టించిన ఇండ్లు శిథిలావస్థకు చేరి కూలిపోతున్నాయి. రాష్ట్రం వచ్చినంక వాటి స్థానంలో డబుల్​బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలుచేయలేదు.

కలెక్టర్ చుట్టూ తిరిగినా
కూల్చేసిన ఇండ్ల స్థానంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిన ఆఫీసర్లు.. తమను ఇంత వరకు పట్టించుకోవడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తరుచూ మహబూబ్‌‌నగర్‌‌‌‌లో జరుగుతున్న ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌‌‌‌కు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. అర్జీలు తీసుకోవడమే తప్ప తమ సమస్యపై స్పందించడం లేదని వాపోతున్నారు. గుడిసెల్లో ఉండడం వల్ల వానకాలం పాములు, తేళ్లు వస్తున్నాయని, ఇప్పటికే పాము కాట్లకు రెండేళ్లలో ముగ్గురు చనిపోయారని చిన్నాయిపల్లె చెంచులు అంటున్నారు. ఇక్కడి పరిస్థితులకు తట్టుకోలేక 40 కుటుంబాలు ముంబై, పుణె, కొందరు హైదరాబాద్‌‌కు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. మరోవైపు చెంచులను ఫారెస్ట్ ఆఫీసర్లు మహ్మదాబాద్ రేంజ్ అడవిలోకి అడుగు పెట్టనివ్వడం లేదు. చెంచులు గతంలో అడవిలోకి వెళ్లి తేనె, దుంపలు, ఇతర అటవీ ఉత్పత్తులను సేకరించి మహ్మదాబాద్, గండీడ్ సంతల్లో అమ్ముకొని వచ్చిన డబ్బుతో బతికేవాళ్లు. ఇప్పుడు అడవిలోకి రానివ్వకపోవడంతో తమకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇల్లు పాయె.. ఉపాధి పాయె
మాకు కష్టం చేసుకునే శక్తి ఉంది. అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకొద్దామన్నా ఆఫీసర్లు పోనిస్తలేరు. ఇండ్లు పాయే.. ఉపాధి కూడా లేకుండా చేస్తిరి. మరి మేమెట్లా బతకాలె? మా పిల్లలు ఏం తినాలె? మాకు సాగు చేసుకోవడానికి భూమి ఇప్పించండి. వ్యవసాయం చేసుకొని బతుకుతాం.
- గంగసాని సాయిలు, చిన్నాయపల్లి

ఊరు వదిలి పోతున్నరు
మేం ఉంటున్న ఇండ్లను కూల్చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తమని అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ చెప్పిండు. ఇంత వరకు కట్టియ్యలే. గూడు లేక చాలా కుటుంబాలు ఊరు వదిలిపోయినయ్. అందరూ ముంబై, పుణె, హైదరాబాద్‌‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నరు. మా లాగే మా పిల్లల పరిస్థితి కూడా ఆగమైంది. 
- దాసరి రాములు, చిన్నాయిపల్లి