మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్...టికెట్ల రేట్లలో డిస్కౌంట్

మహిళలకు  టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్...టికెట్ల రేట్లలో డిస్కౌంట్

మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. T24 టికెట్ రేట్లలో డిస్కౌంట్ అందించాలని నిర్ణయించింది. 

గ్రేటర్ హైదరాబాద్ లో  ప్రయాణించే మహిళలకు T24 టికెట్‌ను కేవలం రూ.80కే అందించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్‌ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90, సీనియర్‌ సిటిజన్లకు రూ.80లకు విక్రయిస్తోంది. అయితే ఇందులో మహిళకు కూడా  రూ.10 తగ్గించి రూ.80కే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కొత్త T24 టికెట్‌ ధర మే 09వ తేదీ  మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ లో  నడిచే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. 

హైదరాబాద్ నగర బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు T24 పేరుతో టీఎస్ఆర్టీసీ టికెట్ ను విక్రయిస్తోంది. దీని  ధరను రూ.100 ఉండేది. అయితే ఇటీ వలే రూ. 10 తగ్గించి రూ.90లకు విక్రయిస్తోంది. అయితే సీనియర్‌ సిటీజన్లకు మాత్రం ఈ టికెట్ ను  రూ.80కే అమ్ముతోంది.  ఈ నేపథ్యంలో ప్రయాణికులు T24 టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.  ప్రతి రోజు సగటున 40 వేల వరకు T24 టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో  మహిళా ప్రయాణికులకు మరింతగా దగ్గర అయ్యేందుకు రూ.80కే  T24 టికెట్‌ అందించాలని ఆర్టీసీ  సంస్థ నిర్ణయించింది.

T 6 టికెట్..

మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టీఎస్ఆర్టీసీ T6 టికెట్ ను ఇటీవల ప్రారంభించింది. ఇందులో భాగంగా  రూ.50కు ఈ  టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చు.  కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం F 24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. వీకెండ్స్‌, సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి  నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చు.