ముషీరాబాద్, వెలుగు: బీజేపీ పాలనలో పేపర్ లీకులు పరిపాటిగా మారాయని హైదరాబాద్ కు చెందిన పలు యూనివర్సిటీల విద్యార్థులు, యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల ఛలో పార్లమెంట్ మార్చ్ కు మద్దతుగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్దులు, యువత, నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్, రవిచ, వైష్ణవి, భార్గవ్ మాట్లాడుతూ పేపర్ లీకేజీలతో ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
40 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై విద్యార్థులంతా పోరాడాలని కోరారు. విద్యా వ్యవస్థపై దాడిలో భాగంగానే లీకులు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులు, విద్యార్థులను అణచివేస్తూ ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ పార్టీలన్నీ విద్యార్థుల సమస్యలపై పోరాడకుండా, రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. ప్రైవేటీకరణను పక్కన పెట్టి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు.
