V6 News

 పలు జిల్లాల్లో వర్షం.. దెబ్బతిన్న పంటలు

 పలు జిల్లాల్లో వర్షం.. దెబ్బతిన్న పంటలు
  • గద్వాల జిల్లాలో 1,738 ఎకరాల్లో పంట నష్టం
  • పలు చోట్ల నేలవాలిన వరి

గద్వాల/గుండాల/మంగపేట, వెలుగు : గద్వాల, భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గద్వాల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈదురుగాలుల కారణంగా అయిజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన కుమ్మరి తిమ్మప్ప అనే రైతుకు చెందిన రెండు ఎకరాల అరటి తోట నేలకొరిగింది. వర్షం కారణంగా అయిజ, రాజోలి మండలాల్లో 1,738 ఎకరాల్లో వరిదెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనావేశారు.

భద్రాద్లి జిల్లా గుండాల మండలంలో బుధవారం మధ్యాహ్నం వర్షం పడడంతో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. ములుగు జిల్లా మంగపేట, కమలాపురం గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు, వర్షం రావడంతో కమలాపురంలో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి నేల వాలింది. పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్‌‌‌‌ స్తంభాలు విరిగిపడడంతో కరెంట్‌‌‌‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కమలాపురం నుంచి ఏటూరునాగారం రోడ్డుపై చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్‌‌‌‌కు అంతరాయం ఏర్పడింది.