500 ఏండ్ల కల నిజమైంది: యోగి ఆదిత్యనాథ్

500 ఏండ్ల కల నిజమైంది: యోగి ఆదిత్యనాథ్
  •     500 ఏండ్ల కల నిజమైంది
  •     అయోధ్యలో ఇక కాల్పులు, కర్ఫ్యూలు ఉండవు: యోగి ఆదిత్యనాథ్
  •     దీపోత్సవ్, రామోత్సవ్, శ్రీరామ సంకీర్తనలే కనిపిస్తయ్
  •     మనం త్రేతాయుగానికి వచ్చినట్లు అనిపిస్తోందన్న ఉత్తర ప్రదేశ్​ సీఎం

అయోధ్య : శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ.. రామరాజ్య ప్రకటన అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్య వీధుల్లో ఇకపై తుపాకీ కాల్పుల చప్పుళ్లు వినిపించబోవని, కర్ఫ్యూలు ఉండవని చెప్పారు. దీపోత్సవ్, రామోత్సవ్, శ్రీరామ్ సంకీర్తనలే కనిపిస్తాయని అన్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు తర్వాత ఆయన మాట్లాడారు. ‘‘ఇది మనందరికీ ఉద్వేగభరితమైన క్షణం. ఇది 500 ఏండ్ల నిరీక్షణ తర్వాత వచ్చింది.

 దేశం మొత్తం రామమయం అయింది. మనం త్రేతాయుగానికి వచ్చినట్లు అనిపిస్తున్నది. రామాలయం.. రాష్ట్ర మందిర్‌‌‌‌ (జాతీయ దేవాలయం). శ్రీరామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన.. దేశం గర్వించదగిన చారిత్రాత్మక సందర్భం’’ అని అన్నారు. ఒక దేశంలోని మెజారిటీ కమ్యూనిటీ.. తమ దేశంలో తమ దేవుడి జన్మస్థలంలో దేవాలయం నిర్మించేందుకు దాదాపు 500 ఏండ్లు నిరీక్షించడం ప్రపంచంలోనే ఇదే మొదటి సారి కావచ్చని అన్నారు. 

శతాబ్దాల నిర్లక్ష్యం, అవమానాలు

‘‘అయోధ్య... శతాబ్దాలపాటు శాపానికి, నిర్లక్ష్యానికి గురైంది. అవమానాలను ఎదుర్కొన్నది. కానీ రాముడి జీవితం మనకు సహనాన్ని, సంయమనాన్ని నేర్పింది. నేడు ప్రపంచం మొత్తం అయోధ్య వైభవాన్ని మెచ్చుకుంటున్నది. అందరూ అయోధ్యకు రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజు త్రేతా యుగం వైభవం అయోధ్యలో అవతరించింది. ఈ నగరం ఇప్పుడు ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా అవతరించనున్నది’’ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వివక్ష లేని సామరస్య సమాజానికి ప్రతీకనే రామరాజ్యమని, మన ప్రధాని పాటించే విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలకు ఇదే ఆధారమని చెప్పారు. 

‘‘సాధువులు, సన్యాసులు, నిహంగ్‌‌లు, మేధావులు, రాజకీయ నాయకులు, గిరిజనులతో సహా సమాజంలోని ప్రతి వర్గం, కులం, ఐడియాలజీ, ఫిలాసఫీ, పూజా విధానానికి అతీతంగా రాముడి కోసం త్యాగం చేశారు. ఈ రోజు నాకు సంతోషంగా ఉంది. ఆలయం నిర్మించాలని నిర్ణయించిన చోటే నిర్మితమైంది” అని తెలిపారు.