ఎవరీ అర్పితా ముఖర్జీ?:  పార్థఛటర్జీ కేసులో కీలక మలుపులు

ఎవరీ అర్పితా ముఖర్జీ?:  పార్థఛటర్జీ కేసులో కీలక మలుపులు

వెస్ట్ బెంగాల్ లో మంత్రి  పార్థఛటర్జీ  అరెస్ట్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. మంత్రి పార్థఛటర్జీ సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ నివాసంలో ఇప్పటికే రూ. 21 కోట్ల 90 లక్షలు, 56 లక్షల విదేశీ కరెన్సీ, 76 లక్షల విలువైన బంగారం సీజ్ చేశారు ఈడీ అధికారులు. మళ్లీ ఇప్పుడు అర్పితా ముఖర్జీకి చెందిన మరో నివాసంలో  28 కోట్లు, 5 కిలోల బంగారం సీజ్ చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 50 కోట్ల రూపాయలు సీజ్ ఐనట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. అలాగే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. లెటెస్ట్ గా దొరికిన అమౌంట్ స్కూల్ రిక్రూట్ మెంట్ స్కాంకు సంబంధించినదేనని అనుమానిస్తున్నారు. తన ఇంట్లో దొరికిన డబ్బంతా బెంగాల్ మంత్రి పార్థ చటర్జీకి చెందినదేనని అర్పితా ముఖర్జీ విచారణలో ఒప్పుకున్నట్టు  తెలుస్తోంది. ఆయన తన ఇంట్లో ఒక రూమ్‌లో డబ్బు ఉంచారని, అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారని ఆమె చెప్పింది. అర్పితా ముఖర్జీ తన ఇంటిని మంత్రి ఒక మినీ బ్యాంకులా ఉపయోగించుకున్నారని, డబ్బును తన ఇంట్లోనే దాచేవారని చెప్పిందట. ఇంట్లోని ఒక గదిలో ఛటర్జీ డబ్బును దాచేవారని, ఆ రూమ్ లోకి మంత్రికి, ఆయన మనుషులకు మాత్రమే ప్రవేశం ఉండేదని తెలిపింది. ప్రతి వారం పదిరోజులకు ఒకసారి ఛటర్జీ తన ఇంటికి వచ్చేవారని, తన ఇంటితోపాటు మరో మహిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంకులా వాడుకున్నారని చెప్పింది. ఆమె కూడా మంత్రికి సన్నిహితురాలేనని, ఆ గదిలో ఎంత డబ్బు ఉంచారో మంత్రి ఏనాడూ తనకు చెప్పలేదని తెలిపింది. ఈ స్టేట్ మెంట్ వచ్చాకే మంత్రి పార్థచటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన తన కుక్కల కోసమే ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్టు ఈడీ విచారణలో తేలింది. 

కేసు దర్యాప్తులో భాగంగా 40 పేజీలున్న ఓ డైరీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంకు సంబంధించిన కీలక విషయాలు ఇందులో ఉన్నట్టు సమాచారం. నగదు లావాదేవీలకు సంబంధించి అందులో వివరాలు ఉన్నాయట. ఈ డైరీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలోని ఉన్నత విద్య, పాఠశాల విద్య విభాగానికి చెందినదిగా గుర్తించారు. ఈ డైరీ అర్పిత ఇంట్లో ఎందుకుందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. 2014 నుంచి 2021 మధ్య కాలంలో జరిగిన టీచర్ రిక్రూట్ మెంట్ చుట్టూనే ఈ కేసు మొత్తం తిరుగుతోంది. 2016లో పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హాయాంలోనే అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. 2014 లో వెస్ట్ బెంగాల్ లో టీచర్ రిక్రూట్ మెంట్ జరిగింది. స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ ద్వారా రిక్రూట్ మెంట్ చేశారు. అయితే 2016లో పార్థా చటర్జీ ఉన్నతవిద్యాశాఖ మంత్రి అయ్యాకే నియామకాలు మొదలయ్యాయి. అయితే.. రిక్రూట్ మెంట్ లో అక్రమాలు జరిగాయని కోల్ కతా హైకోర్టులో కొందరు పిటిషన్లు వేశారు. అనర్హులకు, కనీసం టెట్ రాయని వాళ్లకూ టీచర్లుగా ఉద్యోగాలిచ్చారని కోల్ కతా హైకోర్టులో పిటిషన్లు వేశారు కొందరు అభ్యర్థులు. తక్కువ మార్కులు వచ్చినోళ్లు మెరిట్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లోకి ఎలా వచ్చారని అభ్యర్థులు ప్రశ్నించారు. మెరిట్ లిస్ట్ లో లేనివాళ్లకూ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు.  టీచర్ రిక్రూట్ మెంట్ ఇష్యూ కోర్టు చేరిన టైంలోనే మరో నియామక ప్రక్రియ కూడా జరిగింది. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో 13 వేల గ్రూప్ డీ పోస్టుల భర్తీకి బెంగాల్ సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికోసం ఓ ప్యానెల్ ను నియమించారు. ప్యానెల్ గడువుకు 2019లోనే ముగిసిపోయింది. సరిగ్గా గడువు ముగుస్తున్న టైంలో ఒకేసారి 500 మందికి అపాయింట్ లెటర్లు ఇచ్చారు. దీనిపైనా కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. దీంతో ఇందులో ఏదో తెరవెనక వ్యవహారం నడుస్తోందని అనుమానించిన హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించింది. 

విచారణ ప్రారంభించిన సీబీఐ 69 మంది ప్రైమరీ స్కూల్ టీచర్లు అక్రమంగా రిక్రూట్ అయ్యారని తేల్చింది. టెట్ క్వాలిఫై కానివాళ్లు, కనీస అర్హత లేనివాళ్లకు ఉద్యోగాలిచ్చారని ఎంక్వైరీలో తేలింది. అలాగే 2014లో జరిగిన టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ ను మేనేజ్ చేశారని సీబీఐ గుర్తించింది. పరీక్ష సమయంలోనే అనర్హులను అర్హులుగా మార్చే కుట్ర జరిగిందని చెప్పింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే కొందరు అభ్యర్థులు టెట్ లో ఖాళీ ఆన్సర్ పేపర్లు ఇచ్చినా.. వారికి ఉద్యోగం వచ్చినట్టు సీబీఐ గుర్తించింది. గ్రూప్ డీ పోస్టుల కోసం ఏర్పాటైన ప్యానల్ ఏర్పాటులో తర్వాత ప్యానల్ జరిపిన రిక్రూట్ మెంట్ లోనూ అవకతవకలు జరిగాయంది సీబీఐ. తమ దగ్గరి వాళ్లకే ఉద్యోగాలిచ్చుకున్నారని తేల్చింది. దీంతో ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావాల్సి వచ్చింది. క్రిమినల్ అంశాలపై సీబీఐ ఎంక్వైరీ  చేస్తోంటే.. మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈ కేసులో అర్పితా ముఖర్జీ కీలకంగా మారింది. అసలు అర్పితా ముఖర్జీకి, పార్థ చటర్జీకి ఎక్కడ దోస్తానా కుదిరిందనేది ఆసక్తికరంగా మారింది. సినీనటిగా చెప్పుకునే అర్పితా ముఖర్జీ పెద్దగా సినిమాలు చేసింది లేదు. 2004లో మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె బెంగాలీ సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు చేసింది. చాలా కాలం పాటు ఆమె మిడిల్ క్లాస్ జీవితమే గడిపింది. మిడిల్ క్లాస్ ప్రజలుండే కాలనీలోనే నివసించింది. ఆ తర్వాత సడెన్ గా ఆమె.. కోల్ కతా సెలబ్రిటీలుండే డైమండ్ సిటీకి షిఫ్ట్ అయ్యింది. డైమండ్ సిటీకి మారాక.. ఆమె జీవన విధానం పూర్తిగా మారిపోయిందని సన్నిహితులు అంటున్నారు.  గతంలో దుర్గా నవరాత్రికి 5 వేల రూపాయలు చందా ఇవ్వమంటే అంత డబ్బు తన దగ్గర లేదని చెప్పిందని అపార్టమెంట్ వాసులు అంటున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఫ్లాట్ మెయింటనెన్స్ చార్జీలు 60 వేల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని తెలిసి షాకయ్యామని అంటున్నారు. గతంలో ఐదు వేలు కూడా లేని వ్యక్తి ఫ్లాట్ మెయింటనెన్స్ అంత ఖరీదుగా ఎలా మారిపోయిందో అర్థం కావడం లేదని చెబుతున్నారు.

పార్థ చటర్జీ, అర్పితా ముఖర్జీ ఎక్కువగా దుర్గా నవరాత్రి కార్యక్రమాల్లో కనిపించేవారు. చాలా సార్లు ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. 2021 దుర్గా పూజా మ్యూజిక్ ఆల్బమ్ లో అర్పితా ముఖర్జీ నటించింది. అంతేకాదు 2021 ఎన్నికల్లో పార్థ చటర్జీ తరుపున ప్రచారం కూడా చేసింది. ప్రచార వాహనంలో ఆయన పక్కనే నిలబడి ఆమె రోడ్ షోలు చేశారు. అయితే.. ఇప్పుడు స్కాం బయటపడ్డాక.. ఆమెతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. దొరికిన డబ్బుతోనూ తమకు సంబంధం లేదని ఆ పార్టీ నేతలంటున్నారు. అయితే.. గతంలో మమత బెనర్జీతోనూ వేదిక పంచుకున్నారు అర్పితా ముఖర్జీ. మంత్రి పార్థ చటర్జీ నిర్వహించిన కార్యక్రమాల్లో వేదికపై అర్పిత కూడా కనిపించారు. అలాంటప్పుడు తమ పార్టీకి సంబంధం లేదని ఎలా చెబుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్థచటర్జీకి.. అర్పిత ముఖర్జీతో చాలా ఏళ్ల క్రితమే పరిచయం అయ్యింది. అప్పటి నుంచే ఆమె వ్యవహారం పూర్తిగా మారిపోయిందని తెలిసినవాళ్లు చెబుతున్నారు. మంత్రికి దగ్గరయ్యాకే ఆమె, ఆమె దగ్గరివాళ్ల సోషల్ స్టేటస్ పెరిగిందంటున్నారు. గతంలో మిడిల్ క్లాస్ జీవితాన్ని గడిపిన ఆమె, తన భావతో కలిసి సడెన్ గా మూడు కంపెనీలకు డైరెక్టర్ గా మారిపోయారంటున్నారు. సింబయాసిస్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెంట్రీ ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్, అలాగే ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించి మరో సంస్థ పెట్టినట్టు రికార్డులు తయారు చేశారు. వీటిని అర్పితా, ఆమె బావ కల్యాణ్ ధర్.. డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే.. ఇవన్నీ బోగస్ కంపెనీలు.. కాగితాల మీద తప్ప.. ఎక్కడా లేవని ఈడీ గుర్తించింది. కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కల్యాణ్ ధర్ ఈడీకి చెప్పినట్టు తెలుస్తోంది. తాను 2011లో అర్పిత దగ్గర డ్రైవర్ గా చేరానన్నారు. తనకు మొదట నెలకు 10వేల జీతం ఇచ్చేదని.. ఆ తర్వాత దాన్ని 18 వేలకు పెంచిందని ఈడీకి వివరించారు. స్కూల్ రిక్రూట్ మెంట్ స్కాంలో వరుసగా నగదు పట్టుబడుతుండటంతో బెంగాల్ సర్కారు కూడా రియాక్ట్ అయ్యింది. పార్థ చటర్జీని మంత్రి పదవి నుంచి, పార్టీ పదవుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసే విషయంపై మాత్రం ఏమీ చెప్పలేదు. మరోవైపు.. నేరం చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనంటూ ఇటీవలే కామెంట్ చేశారు మమత బెనర్జీ.