వీడనున్న కన్నెపల్లి పంప్‌‌హౌస్​ మిస్టరీ

వీడనున్న కన్నెపల్లి పంప్‌‌హౌస్​ మిస్టరీ
  •     వివరాలు అందించే పనిలో ఇరిగేషన్‌‌ డిపార్ట్​మెంట్​ 
  •     17 మోటార్లలో పనిచేస్తున్నవి ఎన్నో..
  •     ఇప్పటికీ బయటపెట్టని కాంట్రాక్ట్‌‌ సంస్థ

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : కన్నెపల్లి పంప్‌‌హౌస్ ​మిస్టరీ త్వరలోనే వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికితీయడానికి నియమించిన జ్యుడీషియల్​కమిషన్​ చైర్మన్​ పీసీ ఘోష్‌‌ మోటార్లు మునగడంపై ఇటీవల ఇరిగేషన్‌‌ శాఖ ఆఫీసర్లను వివరణ కోరారు. మోటార్లు మునగడానికి కారణాలేమిటో చెప్పాలని, ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌‌హౌస్​ పరిస్థితిని వివరించాలని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్‌‌ శాఖ ఆఫీసర్లు ఆ వివరాలు సేకరించి కమిషన్​కు అందజేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, పంప్‌‌హౌస్​లో ఏర్పాటు చేసిన 17 మోటార్లలో ప్రస్తుతం ఎన్ని పనిచేస్తున్నాయనేది ఇంకా బయటకు తెలియడం లేదు. రిపేర్లు పూర్తి చేశామని మెగా కంపెనీ చెబుతున్నప్పటికీ పంప్‌‌హౌస్​ దగ్గరికి ఎవ్వరినీ రానివ్వడం లేదు. జ్యుడీషియల్​కమిషన్​ చైర్మన్​ఆదేశాల తర్వాత పంప్‌‌హౌస్​ పరిస్థితి ఏమిటన్నది బయటి జనాలకు తెలిసే అవకాశం ఉంటుందని ఇంజినీరింగ్‌‌ నిపు ణులు చెబుతున్నారు.  

మోటార్ల పనితీరు బయటపెట్టని పాత సర్కారు 

కన్నెపల్లి పంప్‌‌హౌస్​లో నీట మునిగిన 17 మోటార్లు రిపేర్‌‌ చేయడానికి పాత సర్కారు రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసింది. స్కాడా సిస్టమ్‌‌, కంట్రోల్‌‌ ప్యానల్స్, రూ.150 కోట్లతో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్‌‌ అడ్వాన్సుడ్​ ఎయిర్​ కండీషన్డ్​ ​సిస్టమ్, ​ఇతరత్రా రిపేర్ల కోసం ఈ నిధులు వెచ్చించారు. అప్పటి బీఆర్ఎస్​సర్కారు ఆధ్వర్యంలోనే ఈ పనులు జరిగాయి. ఖరాబైన 17 మోటార్లలో 11 మోటార్లను రిపేర్‌‌ చేసి అమర్చామని ఇంజినీర్లు ప్రకటించారు. 
ప్రొటెక్షన్‌‌ వాల్‌‌ కూలడంతో తుక్కుతుక్కయిన 6 మోటార్ల స్థానంలో రూ.400 కోట్లతో కొత్తవి కొని  ఏర్పాటు చేస్తామని అప్పుడే ప్రకటించారు. కానీ, ఇప్పటిదాకా పంప్‌‌హౌస్​పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ ఘోర తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించడానికే కేసీఆర్‌‌ సర్కారు తప్పుడు ప్రచారం చేసిందని ఇంజినీరింగ్‌‌ నిపుణులంటున్నారు.   

వివరాలు సేకరిస్తున్న ఇరిగేషన్‌‌ శాఖ

జ్యుడీషియల్​కమిషన్​ చైర్మన్​ పీసీ ఘోష్‌‌ ఆదేశాలతో ఇరిగేషన్‌‌ శాఖలో చలనం మొదలైంది. కన్నెపల్లి పంప్‌‌హౌస్​లో ఎన్ని మోటార్లు పనిచేస్తున్నాయి? ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలియజేస్తూ అధికారులు ఓ రిపోర్ట్​ రెడీ చేస్తున్నారు. మొన్నటిదాకా కేవలం కుంగిన మేడిగడ్డ బ్యారేజీ చుట్టూనే ఎంక్వైరీ జరిగింది. దీనికంటే ముందే గోదావరి వరదల్లో మునిగిన పంప్‌‌హౌస్​ గురించి పట్టించుకున్న వాళ్లు లేరు. ఇప్పుడు కొత్త సర్కారు నియమించిన జ్యుడీషియల్​కమిషన్​ పంప్‌‌హౌస్ ​గురించి ఎంక్వైరీ చేస్తుండడంతో అప్పడు పనిచేసిన ఇంజినీర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పాత సర్కారు టైంలో చాలా విషయాలు దాచిపెట్టినప్పటికీ, ఇప్పుడు అన్నీ బయటికొచ్చేలా  ఉన్నాయని భయపడుతున్నట్లుగా ఇంజినీరింగ్‌‌ సర్కిల్స్‌‌లో ప్రచారం జరుగుతోంది. 

పంప్‌‌హౌస్​చుట్టూ ప్రైవేట్‌‌ సెక్యూరిటీ 

ఇప్పటికీ కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌‌హౌస్​పరిశీలనకు ఎవరినీ అనుమతించడం లేదు. మెగా కాంట్రాక్ట్‌‌ సంస్థ పంప్‌‌హౌస్ ​చుట్టూరా ఉన్న నాలుగు గేట్లకు తాళాలేసి ప్రైవేట్‌‌ సెక్యురిటీని కాపలాగా ఉంచింది. పొలిటీషియన్స్‌‌, మీడియా వ్యక్తులను దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. ఎందుకిలా చేస్తున్నారని ఇంజినీర్లను అడిగితే వాళ్లెవరూ సమాధానం చెప్పడం లేదు. 

2022 జూలై 14న మునిగిన పంప్‌‌హౌజ్‌‌

గోదావరి వరదలతో జూలై 14, 2022న కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌‌హౌస్​ మునిగింది. మోటార్లకు రక్షణగా కట్టిన ఫోర్‌‌బే సిమెంట్‌‌ గోడ కూలి నీళ్లన్నీ ఒక్కసారిగా పంప్‌‌హౌస్​లోకి రావడంతో 17 మోటార్లు మునిగాయి. గోడ పగిలి మోటార్లపై పడడంతో ఆరు మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. మెగా కాంట్రాక్ట్‌‌ సంస్థ ఈ ‌గోడను నాసిరకంగా కట్టడం వల్లే ఇలా జరిగిందని ఇంజినీరింగ్‌‌ నిపుణులు తేల్చి చెప్పారు. గతంలో కూడా హెడ్‌ ‌రెగ్యులరేటర్‌‌ దగ్గర గేట్ల వద్ద లీకేజీలు జరుగుతున్నాయని , కన్నెపల్లి పంప్‌‌హౌస్​వద్ద ఫోర్‌ ‌బే ప్రొటెక్షన్‌‌ వాల్‌‌ బాగాలేదని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినా, అప్పటి బీఆర్​ఎస్ ​సర్కారు పట్టించుకోలేదు. దీంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం నష్టపోవాల్సి వచ్చింది. 

ఏడాదిగా నో లిఫ్టింగ్‌‌  ‌ ‌

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ లోనే అతి కీలకమైన కన్నెపల్లి పంప్‌‌హౌస్ ​దగ్గర ఏడాదిగా వాటర్‌‌ లిఫ్టింగ్‌‌ ఆగిపోయింది. రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసే విధంగా 17 మోటార్లు అమరిస్తే ప్రస్తుతం 6 మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. గోదావరిలో మోటార్లు మునిగిపోగా, ఈ ప్రాజెక్ట్‌‌ వాటర్‌‌ పంపింగ్‌ ‌సుమారు 6 నెలల పాటు నిలిపివేశారు. మోటార్లన్నీ కూడా విదేశాల నుంచి తెప్పించినవే కావడంతో వేర్వేరు దేశాల నుంచి వచ్చిన ఇంజినీర్లు రిపేర్లు చేశారు. స్కాడా సిస్టమ్‌‌, కంట్రోల్‌‌ ప్యానల్స్, ఆటోమేటెడ్‌‌ అడ్వాన్సుడ్‌ ఎయిర్ ​కండీషన్డ్​ సిస్టమ్​ మళ్లీ అమర్చారు. 2022 డిసెంబర్​లో మళ్లీ ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించి 6 మోటార్లతో నీటిని ఎత్తిపోశారు. మిగతా 11 మోటార్ల పనితీరు ఏంటో ఇప్పటికీ ఇరిగేషన్‌‌ ఇంజినీర్లు ప్రకటించడంలేదు. 2023 జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు అప్పుడప్పుడు 6 మోటార్లు నడిపి 24 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశారు. ఇదే ఆఖరు. తర్వాత పంప్‌‌హౌస్ ​వాటర్‌‌ లిఫ్టింగ్‌‌ పూర్తిగా బందయ్యింది.