డిజిటల్ అరెస్ట్ చేశామంటూ.. హైదరాబాద్ లో రిటైర్డ్ జడ్జికి రూ. 1.66 కోట్ల టోకరా

డిజిటల్ అరెస్ట్ చేశామంటూ..  హైదరాబాద్ లో  రిటైర్డ్ జడ్జికి రూ. 1.66 కోట్ల టోకరా
  • మనీ లాండరింగ్, హ్యూమన్ ​ట్రాఫికింగ్ చేస్తున్నావని బెదిరించిన సైబర్​ నేరగాళ్లు
  • సీబీఐ నుంచి ఎంక్వైరీ చేస్తున్నామని.. ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని వార్నింగ్​
  • బెంగళూరులోనూ కేసు నమోదైందంటూ బెదిరింపులు

ఎల్బీనగర్, వెలుగు: డిజిటల్​అరెస్ట్​పేరుతో సైబర్​నేరగాళ్లు ఓ రిటైర్డ్​జడ్జిని బురిడీ కొట్టించి.. రూ.1.66 కోట్లు కాజేశారు. అమ్మాయిలకు ఫోన్​చేసి అసభ్యంగా మాట్లాడుతున్నావని.. మానవ అక్రమ రవాణాలో భాగస్వామ్యం ఉందని.. మనీ ల్యాండరింగ్​కూడా చేశావంటూ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘‘వీఆర్​ఫ్రం సీబీఐ.. నీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎంక్వైరీ ఈ వీడియో కాల్​లో చేయబోతున్నాం. అప్పటివరకు నువ్వు డిజిటల్​అరెస్ట్​లో ఉంటావ్​.. ఈ సమయంలో నువ్వు ఇంటి నుంచి అడుగుబయట పెట్టడానికి వీల్లేదు’’ అంటూ ముచ్చెమటలు పట్టించారు. తాను రిటైర్డ్​ జడ్జినని చెప్పినా కొంచం కూడా జంకలేదు. పైగా, కొన్ని గంటల పాటు ఆయనను లైన్​లోనే పెట్టి రూ. కోటిన్నరకు పైగా డబ్బును వారి అకౌంట్లకు ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నారు. తమ ఎంక్వైరీలో ఆరోపణలు తప్పని తేలితే తిరిగి ఇచ్చేస్తామని నమ్మ బలికారు. ఎంత సేపటికీ తాను పంపిన డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆయన సైబర్​క్రైమ్​ పోలీసులను ఆశ్రయించారు.  

ఎన్నో తీర్పులు చెప్పారు.. అయినా..

ఆయన రిటైర్డ్ జడ్జి.. తన జీవితంలో ఎన్నో తీర్పులు చెప్పి ఉన్నత విలువలు గల న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారు. కొన్నేండ్ల కింద పదవీ విరమణ పొంది ఇంట్లోనే ఉంటున్నారు. కానీ, ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతోంది? ఎటువంటి మోసాలు జరుగుతున్నాయన్న అవగాహన లేకపోవడం ఆయనను తీవ్రంగా నష్టపరిచింది. రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ కింద వచ్చిన డబ్బులన్నీ ఆయన అకౌంట్​లోనే ఉండగా, విషయం తెలుసుకున్న సైబర్​ క్రిమినల్స్​ఆయన్ను టార్గెట్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కాల్​వచ్చింది. లిఫ్ట్​ చేసి మాట్లాడగా తాము సీబీఐ అధికారులమని పరిచయం చేసుకున్నారు. మనీ లాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసులు ఉన్నాయని, ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు.

 తర్వాత తమ ఉన్నతాధికారి మాట్లాడుతాడంటూ వీడియో కాల్​కనెక్ట్​చేయించారు. ‘‘సర్.. మీపై కర్నాటక రాష్ట్రం బెంగళూరు సిటీలోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సారీ టు సే దిస్.. మానవ అక్రమ రవాణా కేసులో మీపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన రెండు ఫోన్ నెంబర్ల నుంచి మహిళలకు అసభ్యకరమైన కాల్స్ వెళ్తున్నాయి అని మాకు కంప్లయింట్స్​వచ్చాయి’’ అని భయపెట్టారు. అందుకే తాము డిజిటల్​అరెస్ట్​చేశామని, ఇప్పుడు తాము చెప్పిన విషయాన్ని కుటుంబసభ్యులు, బంధువులకు.. పోలీసులకు ఎవరికీ చెప్పొద్దని.. అలా చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో రిటైర్డ్​జడ్జి కంగారు పడ్డారు. మనీ ల్యాండరింగ్​కేసు ఉన్నందున బ్యాంక్ ఖాతా వివరాలన్నీ చెప్పాలని అన్ని వివరాలు తీసుకున్నారు. అకౌంట్ చెక్​చేస్తామని, అంతకుముందు అకౌంట్​లోని డబ్బులన్నీ తమకు బదిలీ ట్రాన్స్​ఫర్​చేయాలని కోరారు. 

అన్నీ సరిగ్గానే ఉన్నాయని తేలితే డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. ఇంతకాలం పరువు, మర్యాదలతో బతికానని, తన ప్రమేయం లేకపోయినా ఇప్పుడు వస్తున్న ఆరోపణలు బయటకు తెలిస్తే తాను కాపాడుకున్న ప్రతిష్ట దెబ్బతింటుందని భావించారు. వెంటనే ఆయన అకౌంట్​నుంచి సైబర్​క్రిమినల్స్​ చెప్పిన అకౌంట్​కు రూ.1.66 కోట్లు బదిలీ చేశారు. విచారణ తర్వాత డబ్బులు తిరిగి రాకపోవడంతో తనకు ఎక్కడి నుంచి కాల్​వచ్చిందో ఆ నంబర్​కు కాల్​ చేశారు. ఆ నంబర్లు పని చేయకపోవడంతో మోసపోయానని గుర్తించి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాదు. దీంతో నిందితులను వీలైనంత తొందరగా పట్టుకునేందుకు సైబర్ సెక్యూరిటీ వింగ్ అధికారులు స్పెషల్​టీమ్​ను ఏర్పాటు చేశారు.