గ్రామాల అభివృద్ధే లక్ష్యం  : మంత్రి ధనసరి సీతక్క 

గ్రామాల అభివృద్ధే లక్ష్యం  : మంత్రి ధనసరి సీతక్క 

ములుగు/ వెంకటాపూర్​(రామప్ప), వెలుగు: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క స్పష్టం చేశారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మంత్రి ములుగు, వెంకటాపూర్​, గోవిందరావుపేట మండలాల్లో విస్తృత పర్యటన చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాలను పరిశీలించారు.

ములుగు మండలం దేవగిరిపట్నంలో రూ.10లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేసి చింతలపూడి వినోద ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశానికి హాజరయ్యారు. ఇంచర్ల, కన్నాయిగూడెం గ్రామాల్లో మహిళా సమాక్య భవనాలకు శంకుస్థాపన చేశారు.

వెంకటాపూర్​ లో వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్​ లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని లక్ష్మీదేవిపేటలో మహిళా సమాఖ్య భవనం, ఎల్లారెడ్డిపల్లిలో పీఆర్​ శాఖ ద్వారా రూ.17.50లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు, రూ.20లక్షలతో నిర్మించిన జీపీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు.  

చిత్తశుద్ధితో పనిచేయాలి 

ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా అవసరాల కోసం సమన్వయంతో ముందుకు తీసుకుపోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై ములుగు కలెక్టరేట్ లో కలెక్టర్​ దివాకర అధ్యక్షతన ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ములుగులో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ తో కలిసి హాజరై జిల్లాలోని మహిళా స్వయం సహాయక 585సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజి ద్వారా రూ. 52.50కోట్ల రుణాల చెక్కును అందజేశారు.