ఉద్యోగాల భర్తీనే ఎమ్మెల్సీ ఎజెండా

ఉద్యోగాల భర్తీనే ఎమ్మెల్సీ ఎజెండా
  •     గ్రాడ్యుయేట్ ఎలక్షన్​పై కాంగ్రెస్ ఫోకస్
  •     ప్రచారంలో ముందున్న తీన్మార్ మల్లన్న.. 27న పోలింగ్
  •     టీఎస్ పీఎస్పీ ప్రక్షాళన తో గ్రాడ్యుయేట్లలో పాజిటివ్
  •     4 నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిన కాంగ్రెస్ సర్కార్​
  •     బీజేపీకి ఇబ్బందిగా రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అంశాలు

హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికలు పూర్తి కావటంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించింది. ఉద్యోగాల భర్తీ ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికలకు వెళ్తున్నది. టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేయడం, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 30 వేల ఉద్యోగాల భర్తీ చేయడం కాంగ్రెస్ కు పెద్ద సానుకూలాంశంగా ఉంది. దీనికితోడు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రచారంలో ముందున్నారు.

మూడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం రద్దు అంశాలు ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఇబ్బందికరంగా మారనున్నాయి. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​జరగనుంది. 25వ తేదీ వరకు ప్రచారానికి గడువు ఉంది. 4.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. త్వరలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో సీఎం రేవంత్​రెడ్డి పర్యటించే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి వరంగల్ కు చెందిన రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

కోదండరాం, సీపీఐ మద్దతు కాంగ్రెస్​కే

2021లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ చీఫ్ కోదండరాం, సీపీఐ నుంచి జయసారథి రెడ్డి  పోటీ చేశారు. మూడో ప్లేస్ లో నిలిచిన కోదండరాంకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు 70వేలకు పైగా దక్కాయి. సీపీఐకి 9వేలకు పైగా ఓట్లు వచ్చాయి. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా చెరుకు సుధాకర్ గౌడ్, రాణిరుద్రమరెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు.

ఈ సారి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గతంలో ఇండింపెండెంట్ అభ్యర్థులుగా ఉన్న కోదండరాం, చెరుకు సుధాకర్, రాణిరుద్రమ, సీపీఐ అభ్యర్థి ఇప్పుడు పోటీలో లేకపోవటం కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్​గా మారాయి. కోదండరాం మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది. అలాగే సీపీఐ మిత్రపక్షంగా ఉండటం కలిసొచ్చే అంశం.

మూడు ఉమ్మడి జిల్లాల్లో బలంగా అధికార పార్టీ

ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గతేడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ మూడు సీట్లు మాత్రం గెలవగా, మిగతా అన్ని సీట్లు కాంగ్రెస్ గెలిచింది. తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో గెలిచిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఒక్కరే బీఆర్ఎస్​లో ఉన్నారు.

ఇక ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం గమనార్హం. ఈ మూడు జిల్లాల నుంచి ఆరుగురు మంత్రులు ఉన్నారు. ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగియగానే మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్లను కలిసి నాలుగు నెలల పాలన, ఉద్యోగాల భర్తీ, ఆరు గ్యారంటీలు, రానున్న రోజుల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాల గురించి వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

బీజేపీకి ఇబ్బందులు

లోక్​సభ ఎన్నికల్లో బాగా చర్చలకు వచ్చిన రిజర్వేషన్ల తొలగింపు, రాజ్యాంగం రద్దు అనే అంశాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి పెద్ద ఇబ్బందిగా మారనున్నాయి. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలపై ఆ వర్గం ప్రజలు మండిపడుతున్నారు. అన్ని పార్టీలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి.

వీటితో ఈ సారి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని, ఎన్నికలే ఉండవని ఇతర దేశాల్లో ఉన్నట్లు అధ్యక్ష తరహా పాలన ఉంటుందని ఆందోళనలో ఉన్నారు. బీసీ కులాల జనాభా లెక్కింపు, రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్​ హామీ ఇవ్వడంతో బీజేపీని ఓడించాలని ఇప్పటికే బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 39వేలకు పైగా ఓట్లు రాగా ఈ సారి తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గ్రూప్​1, డీఎస్సీతో సానుకూలం 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన చేసింది. దీంతో నిరుద్యోగుల్లో సానుకూలత ఏర్పడింది. అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల పరీక్షలకు డేట్లను ప్రకటించటంతో పాటు పాత గ్రూప్1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక టీచర్ల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయటంతో పాటు పోస్టుల సంఖ్యను కూడా పెంచింది.