పరిపాలించేవారికి పేదలపై, శ్రామికులపై, గ్రామీణులపై ప్రేమ లేకపోతే ఎలాంటి చట్టాలు రూపొందుతాయో.. ‘వీబీ జీ రామ్ జీ’ అనే పేరుతో పిలిచే ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్’ బిల్లు నిరూపిస్తోంది. ప్రజల వద్ద ఉన్న.. ఉపాధిని కోరే హక్కు, వేతనాల హక్కు, పారదర్శక జవాబుదారీ కోరే హక్కును కాలరాస్తూ నిర్దాక్షిణ్యంగా వారి నుంచి కేంద్రం లాక్కునే అమానవీయ చట్టం ఇదే. 145 కోట్ల భారతీయులను కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడే దుస్థితికి తీసుకొచ్చే అత్యంత బాధాకరమైన చట్టమిది. ఇప్పటికే దేశ కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ, వారిని కుబేరుల్ని చేస్తున్న మోదీ సర్కార్ ఇప్పుడు ఏకంగా గ్రామీణ భారతాన్ని సైతం గంపగుత్తగా అనాథల్ని చేసేసింది. ఈ శక్తులకు మోకరిల్లే పనులకు అధికారికంగా తెరతీసిన అత్యంత లోపభూయిష్టమైన చట్టమిది. అన్నింటికన్నా మించి జాతిపిత మహాత్ముడిని ప్రజల మనసుల్లోంచి తీసేసి ‘జీ రామ్ జీ బిల్లు’ తెచ్చారు. దీన్ని ముక్త కంఠంతో ఖండించకపోతే... దీని రద్దుకు పోరాడకపోతే దేశంలో అసమానత ఎలా తొలగేను?
నాడు నల్లచట్టాలను నిరసించిన తీరులా ఈ చట్టాన్ని రద్దు చేసేవరకూ ఈ దేశ గ్రామీణులు పక్షాన, ఈ దేశ ఉపాధి కూలీల పక్షాన మనమందరం గొంతెత్తవలసిందే. ఉమ్మడి ఏపీలోని అనంతపురంలో 2 పిబ్రవరి 2006న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీల చేతులమీదుగా ప్రారంభమైన అతి గొప్ప పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సంక్షిప్తంగా ‘నరేగా’ అని పిలిచే ఉపాధిహామీ పథకం. అభివృద్ది చెందిన అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాలను మించి ప్రపంచంలోనే మూడింట ఒకవంతు ఉన్న జన సమూహానికి ఉపాధికి భరోసానిచ్చిన అతి గొప్ప పథకమిది. ముఖ్యంగా గ్రామీణ భూమిలేని పేదలకు, అట్టడుగున ఉన్న వర్గాలకు, మహిళలకు మహాత్ముడు ఆశించిన సంపూర్ణ స్వరాజ్యాన్ని అందించిన పథకమిది. పని అనేది తమహక్కుగా... తమకు కావాల్సిన సమయంలో పనిని అడిగే హక్కుతోపాటు, ఆ పనిలో జరిగే అవినీతిని ప్రశ్నించే హక్కు, సకాలంలో వేతనాలు పొందేహక్కును కల్పిస్తూ ప్రతి గ్రామీణుడికి 100 రోజుల పనిని కల్పించిన ఏకైక పథకమిది.
గ్రామ స్వరూపాన్ని మార్చిన ‘నరేగా’
వ్యక్తిగా నిమ్నవర్గాలకు చేకూరిన ప్రయోజనం ఇది. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, ఎక్కడికో వలసపోయి దుర్బరమైన జీవనాన్ని గడపకుండా, తమ కూలిపై బేరమాడే శక్తిని ఇస్తూ తద్వారా ఉన్న ఊరిలోనే స్వేచ్ఛగా, నిర్భంధాలు లేని గౌరవ ప్రదమైన జీవితాన్ని వారు పొందారు. అయితే,
వ్యవస్థలోనూ గ్రామీణ ఉపాధి హామీ తెచ్చిన మార్పు చిన్నదేమీ కాదు. ఒకరకంగా మనదేశ గ్రామీణ ముఖ చిత్రాలు ’నరేగా’ పథకానికి ముందు, వెనకా అన్నా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ ఉపాధి హామీ పథకం అండతో గ్రామ స్వరూపాన్నే మార్చే ఎన్నో పనులు జరిగాయి. చెరువులు, కుంటల పూడికతీతతో భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ స్థిరీకరణతో ఊరి ఆదాయం పెరిగింది. ఆ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు చేర్చే రోడ్లు బాగుపడ్డాయి. వివిధవర్గాలకు కమ్యూనిటీ హాళ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, చెక్‌డ్యాములు, తోటలు వంటి ఊరుమ్మడి ఆస్తులు ఏర్పడ్డాయి. ఇలా 2004 నుంచి 2014 వరకూ స్వర్ణయుగాన్ని గ్రామీణానికి తీసుకువచ్చి అక్షరాల కోట్లాది కోట్ల రూపాయల సంపద గ్రామానికి చేరింది.
పెత్తనం కేంద్రానిదే
అలాగే, గ్రామసభల్లో పనుల్ని నిర్ణయించుకునే అతి ముఖ్యమైన అధికారాన్ని ఏకంగా కేంద్రం చేతిలోకి తీసుకోవడమే కాకుండా, గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల న్యాయబద్ధమైన సకాలంలో వేతనం పొందే హక్కును తనే తీసుకుంది. ఇది అంతిమంగా పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ గ్రామ స్వరాజ్యాన్ని నాశనం చేయడం కాదా? అయితే, తమకే పేటెంట్ ఉందనుకునే రాముడి పేరును పథకంలో చేర్చి కోట్లాది భారతీయ హిందూ కూలీల జీవితాల్లోని రామరాజ్యాన్ని లాక్కోవడం అర్థరహితం.
స్కిల్డ్ కార్మికులుగా తీర్చిదిద్దాలి
కళ్లముందు ఇంత అన్యాయంగా కనిపిస్తున్నా ఈ చట్టం ఆచరణలోకి వస్తే ఎంతటి విశృంఖలత్వం చేస్తుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అసలు ప్రభుత్వాలుగా చేయాల్సిన పని దేశపౌరులు ముఖ్యంగా గ్రామీణ నిరుపేదలు, రైతుల ఆదాయాల్ని పెంచాలి. కానీ, యూరియా సబ్సిడీకి మంగళం పాడుతూ.. మెకనైజేషన్ పాలసీని అభాసుపాలు చేస్తూ వ్యవసాయాన్ని దినదిన గండంలా ఈ పన్నెండేళ్లలో చేసింది మోదీ ప్రభుత్వం. మార్పుచెందుతున్న నేటి ఆధునిక ఏఐ సాంకేతికయుగంలో దానిని వ్యవసాయంలోకి తీసుకురావాలి. యాంత్రీకరణతో కూలిపనులు తగ్గిపోతున్న పరిస్థితుల్లో వారిని స్కిల్డ్ కార్మికులుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వ విధానాల్ని రూపొందించుకోవాలి. వ్యవసాయంలో నాట్లు మొదలు కోతల వరకూ పాశ్చాత్య దేశాలకు దీటుగా మెకనైజేషన్ పెంచాలి. అందుకు తగ్గట్టుగా మన మానవ వనరులైన గ్రామీణుల్ని నాటువేసే యంత్రాల నైపుణ్యులుగా, పంటలకు మందులు చల్లే డ్రోన్ ఆపరేటర్లుగా, కలుపులు తీసే యంత్రాలను
నడిపేవారుగా, హర్వెస్టర్, ట్రాక్టర్ ఇలా వ్యవసాయంలోని ప్రతి పనిముట్టును సమర్థవంతగా నడిపే సుశిక్షుతులుగా మార్చాలి.
ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలి
సబ్సిడీలతో మిషన్లు అందజేస్తూ, ప్రత్యేక శిక్షణలు ఇస్తూ తద్వారా వారిని స్కిల్డ్ కార్మికులుగా తీర్చిదిద్దాలంటే.. ఈ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవ సాయానికి అనుసంధానించాలి. దీంతో గ్రామీణ ప్రజలు, యువకుల ఆదాయం పెరుగుతుంది. తద్వారా దేశ తలసరి ఆదాయాన్ని, జీడీపీని పెంచుకోవచ్చు. ఏ ఆర్థికశాస్త్రం ఏమి చెప్పినా... ఏ మాంద్యం మనల్ని ఏం చేయలేదంటే కేవలం మనది వ్యవసాయక దేశంగా ఉండటమే ప్రధాన కారణం. అందుకే సంపద పెంచుకోవడానికి ఆ రంగంలో ఇలాంటి సంస్కరణలు తేవాల్సిన చోట, పెనం మీది నుంచి పొయ్యిలోకి తోసేసినట్టుగా ఈ పేర్లు మార్చే చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేయడం మన దురదృష్టకరం. ఇప్పటికైనా మోదీ పరివారం మేల్కొని కార్పొరేట్ల కోసం కాకుండా ఈ దేశ ప్రజల కోసం ఆలోచించాలి. గతంలో తెచ్చిన నల్లచట్టాల్ని వెనక్కి తీసుకున్నట్టే జీ రామ్ జీ చట్టాన్ని కూడా వెనక్కితీసుకోవాలి. గాడ్సే వారసత్వాన్ని వీడి జాతిపిత గౌరవం నిలిపేలా మహాత్ముడి పేరును తొలగించుకునే ఆలోచన విరమించుకోవాలి. అందుకోసం దేశ ప్రతిపక్షంగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావల్సిన పరిస్థితులు
రోజురోజుకూ పెరుగుతున్నాయి.
రాష్ట్రాలపై అదనపు భారం
అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ప్రధాని హోదాలో మోదీ నిండు పార్లమెంట్లోనే ఈ పథకం పనికిరానిది అన్నట్టుగా మాట్లాడారు, ఎట్టకేలకు జీ రామ్ జీ బిల్లుతో చట్టాన్ని తెచ్చారు. ఇప్పటికే జీఎస్టీ సంస్కరణల పేరుతో రాష్ట్రాల ఆదాయాన్ని లాక్కుంటున్న కేంద్రం.. ఇప్పుడు నిధుల లేమితో సతమతమవుతున్న రాష్ట్రాలను మరింతగా ఇబ్బందిపెట్టేలా ఉపాధి హామీ పథకంలో పూర్తిగా ఉండే తన వాటాను కొత్త బిల్లుతో 60 శాతానికి పరిమితం చేసుకుంది. గతంలో రాష్ట్రాల వాటా 10 శాతం ఉండగా ఇపుడు 40 శాతానికి పెంచారు. ఇలా రాష్ట్రాలపై భారం పెంచితే ఈ ఉపాధి పథకం దానంతట అదే పడకేయడం ఖాయమని వారికి ఉన్నట్లుంది! కొంతకాలానికి ఈ పథకం నీరుగార్చాలనే ఉద్దేశమే లేకపోతే రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలనే నిబంధన ఎందుకు తెచ్చినట్లు!
- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో, టిసాట్ నెట్వర్క్
