సాధారణంగా ఏనుగులు జనవాసాల్లోకి వస్తే ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. కానీ థాయ్‌లాండ్‌లో ఒక అడవి ఏనుగు మాత్రం కస్టమర్ లాగా నెమ్మదిగా షాపులోకి వెళ్లి, కావాల్సిన చిరుతిళ్లు తినేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.
వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌లోని ఓ రోడ్డు పక్కన ఉన్న కిరాణా షాపులోకి 'ప్లాయ్ బియాంగ్ లెక్' అనే అడవి ఏనుగు ప్రశాంతంగా నడుచుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్నవారిని భయపెట్టకుండా, తన తొండంతో షాపులోని షెల్ఫ్‌లను వెతికింది. తనకు నచ్చిన ప్యాక్ చేసిన చిరుతిళ్లను తినేసింది. చివరకు ఒక శాండ్‌విచ్‌ను కూడా వదలకుండా నోట్లో వేసుకుని, పని ముగిశాక మెల్లగా బయటకు వెళ్లిపోయింది.
ఈ ఏనుగు పేరు ప్లాయ్ బియాంగ్ లెక్. ఇది స్థానికులకు బాగా తెలుసు. దగ్గరలోని నేషనల్ పార్క్ నుండి ఇది అప్పుడప్పుడు ఇలా ఆహారం కోసం ఊళ్లలోకి వస్తుంటుంది. ఈ ఏనుగు చేసిన పని వల్ల షాపు యజమానికి సుమారు 25 డాలర్ల అంటే రూ. 2 వేల నష్టం వాటిల్లింది. ఈ మొత్తాన్ని కూడా ఒక వన్యప్రాణి సంరక్షణ సంస్థ యజమానికి చెల్లించి, సమస్యను పరిష్కరించింది.
నెటిజన్ల కామెంట్లు
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేసారు. ఇన్సూరెన్స్ కంపెనీకి దీని గురించి ఎలా వివరిస్తారు ? అని ఒకరు జోక్ చేయగా.. ఏనుగుకు షాపింగ్ లిస్ట్ అవసరం లేదు, దానికి ఎక్కడ ఏం దొరుకుతాయో బాగా తెలుసు అని మరొకరు కామెంట్ చేశారు. ఇన్సూరెన్స్ పాలసీల్లో జంబో యాక్సిడెంట్ క్లాజ్ ఉందా ? అని మరికొందరు ఫన్నీగా అడుగుతున్నారు.
చూడటానికి ఈ ఘటన సరదాగా అనిపించినా, అడవులు తగ్గిపోతుండటం వల్లే వన్యప్రాణులు ఇలా ఊళ్ల మీదకు వస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Imagine explaining this to your insurance pic.twitter.com/TK5cISPi8e
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 25, 2026

