యూట్యూబ్లో చూసి వంట చేయొచ్చు గానీ వైద్యం చేయకూడదు. వంట కుదరకపోతే.. ఉప్పు, కారం వేసి మేనేజ్ చేయొచ్చు. కానీ.. వైద్యం వికటిస్తే మనిషి ప్రాణమే పోవొచ్చు. ఉత్తర్ ప్రదేశ్లో ఇదే జరిగింది. యూట్యూబ్ ట్యుటోరియల్ వీడియోలు చేసి వైద్యం చేయడం.. కాదు కాదు ఆపరేషన్ చేయడంతో ఆ ఆపరేషన్ వికటించి 38 ఏళ్ల మహిళ నిండు ప్రాణం పోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి పరిధిలో ఈ ఘటన జరిగింది. కోత్వాలి కోఠి ప్రాంతంలోని సైదాన్‌పూర్ గ్రామానికి చెందిన బాధితురాలు మునిశ్రా రావత్ కడుపు నొప్పితో బాధపడుతోంది. డిసెంబర్ 5న, ఆమె భర్త ఫతే బహదూర్ రావత్ ఆమెను "శ్రీ దామోదర్ ఔషధాలయ"కు తీసుకెళ్లాడు. ఇది మాజీ గ్రామ సర్పంచ్ జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న క్లినిక్.
జలుబు, జ్వరం.. ఇలా తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్యం చేస్తుండేవాడు. మాత్రలు, ఇంజెక్షన్స్ ఇచ్చి నయం చేసేవాడు. ఊళ్లలో ఒక ఆర్ఎంపీ తరహాలో. అయితే.. కడుపు నొప్పితో బాధపడుతున్న మునిశ్రా రావత్కు జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా ఎటువంటి వైద్య పరీక్షలు చేయలేదు. అతను ఆమె పొత్తి కడుపుని పట్టుకుని చూసి.. కడుపులో రాయి ఉండటం వల్ల నొప్పి వస్తుందని.. ఆపరేషన్ చేసి ఆ రాయిని వెంటనే తొలగించాలని చెప్పాడు. ఆలస్యం చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు. ఈ ఆపరేషన్ కోసం.. మిశ్రా రూ.25 వేలు అడిగాడు. తాము రూ. 20 వేలు సర్దుబాటు చేశామని బాధితురాలి భర్త ఫతే బహదూర్ చెప్పాడు. జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా మాజీ సర్పంచ్ కావడం వల్ల అతని వైద్యాన్ని తాము నమ్మామని తెలిపాడు.
యూట్యూబ్ ట్యుటోరియల్ చూస్తూ జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా ఆపరేషన్ మొదలుపెట్టాడు. అతనికి మిశ్రా మేనల్లుడు కూడా సాయం చేశాడు. ఇద్దరూ ఎలాంటి మెడికల్ ట్రైనింగ్ తీసుకోలేదు. డాక్టర్లు కానే కాదు. యూట్యూబ్ ట్యుటోరియల్ చూస్తూ కడుపులో కోయడం మొదలుపెట్టాడు. దురదృష్టవశాత్తూ బాధితురాలు మునిశ్రా రావత్ కడుపులో నరాలు, రక్త నాళాలు తెగిపోవడంతో బ్లీడింగ్ అయి చాలా రక్తం పోయింది. అరకొర వైద్యం తెలిసిన మిశ్రాకు.. ఏం చేయాలో పాలుపోలేదు.
ALSO READ : పెళ్లింట విషాదం! ఇంటి పైకప్పు కూలి 20 మందికి గాయాలు.. షాకింగ్ విజువల్స్..
ఏదో విధంగా రక్తం పోకుండా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని గంటల్లోనే ఆమె చనిపోయింది. బాధిత కుటుంబం క్లినిక్ ముందు ధర్నా చేయడంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. పోలీసులు, వైద్య శాఖ అధికారులు క్లినిక్ గురించి ఆరా తీసి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా.. అక్రమంగా క్లినిక్ నడిపిస్తున్నట్లు తేల్చారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు జ్ఞాన్ ప్రకాష్ మిశ్రాను అరెస్ట్ చేశారు. అవగాహన లేకుండా ఇలా శస్త్ర చికిత్సలు చేయించుకోవద్దని వైద్య శాఖ గ్రామస్తులకు సూచించింది.
