V6 News

పెళ్లింట విషాదం! ఇంటి పైకప్పు కూలి 20 మందికి గాయాలు.. షాకింగ్ విజువల్స్..

పెళ్లింట విషాదం!  ఇంటి పైకప్పు కూలి 20 మందికి గాయాలు.. షాకింగ్ విజువల్స్..

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో జరిగిన ఒక పెళ్లిలో ఊహించని సంఘటన జరిగింది. పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడంతో 20 మందికి పైగా అతిథులు గాయపడ్డారు. ఈ సంఘటన భయానక వాతావరణాన్ని సృష్టించింది. రెండు మూడు రోజుల కిందట జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు డ్రోన్ కెమెరాలో రికార్డ్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 ఏం జరిగిందంటే : పెళ్లి ఇంట్లో అతిథులు డ్యాన్స్ చేస్తుండగా, దాదాపు 20-30 మంది ఇంటి పైకప్పు పైకి ఎక్కి  చూస్తుండగా  పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దానిపై ఉన్న వారందరూ శిథిలాలతో పాటు కిందకు పడిపోయారు. నిజానికి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా  పైనుంచి రికార్డ్ చేయడానికి డ్రోన్ కెమెరాను పెట్టారు. అయితే, ఆ డ్రోన్ కెమెరానే ఈ ప్రమాదకర క్షణాన్ని మొత్తం రికార్డ్ చేసింది. ఫుటేజ్‌లో అతిథులు ఇంటి పైన డ్యాన్స్ చేస్తుండగా అక్కడ ఉన్నవారు పక్కన నిల్చొని చూస్తుంటారు. కొన్ని సెకన్లలోనే వారు నిల్చున్న పైకప్పు పెద్ద శబ్దంతో కూలిపోతుంది. దాంతో పెళ్లి ఇంట్లో గందరగోళం చెలరేగింది. 

Also Read : బొగ్గుల పొయ్యిపై తందూరీ చేస్తే రూ.5వేలు ఫైన్

ఈ ప్రమాదంలో 20 మందికి పైగా అతిథులు గాయపడినట్లు  తెలిపారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రాణనష్టం జరగలేదు, కానీ చాలా మందికి  గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకేసారి అంత మంది జనం పాత ఇంటి పైకప్పు పై నిలబడటం వల్ల ఆ బరువును మోయలేకపోయిందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో చలికాలంలో పాత ఇళ్ల పైకప్పులు బలహీనపడే అవకాశం ఉంటుందని తెలిపారు.

 

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పెద్దగా ప్రాణ నష్టం జరగకపోవడంపై అంతా ఊపిరి పీల్చుకోగా, ఇలాంటి   వేడుకల సమయంలో పాత భవనాలపై మరింత జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సూచించారు.