V6 News

బొగ్గుల పొయ్యిపై తందూరీ చేస్తే రూ.5వేలు ఫైన్.. ఢిల్లీలో కొత్త ఎయిర్ పొల్యూషన్ రూల్స్..

బొగ్గుల పొయ్యిపై తందూరీ చేస్తే రూ.5వేలు ఫైన్.. ఢిల్లీలో కొత్త ఎయిర్ పొల్యూషన్ రూల్స్..

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్య సమస్య పట్టి పీడిస్తోంది. అక్కడి ప్రభుత్వం దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. రోజురోజుకూ తగ్గుతున్న గాలి నాణ్యతతో బతకటం కష్టంగా మారిపోయిందని నగరవాసులు ఆందోళనలు పెంచుతున్న వేళ సీఎం రేఖా గుప్తా కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. 

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయిలు ఆందోళన కలిగిస్తున్న వేళ సీఎం రేఖా గుప్తా నగరంలో బహిరంగా చెత్తను కాల్చటంపై పూర్తి నిషేధం విధించారు. దీనికి తోడు అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తందూర్‌ల తయారీలో బొగ్గు, కట్టెల వినియోగాన్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. బహిరంగంగా చెత్తను దహనం చేయవద్దని ప్రజలందరినీ వినయంగా అభ్యర్థిస్తున్నామని చెప్పారు. ఈ చిన్న సహకారం కూడా గొప్ప మార్పు తీసుకురాగలదని ఆమె ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయితే కొత్త రూల్స్ ప్రకారం బహిరంగంగా చెత్తను కాల్చిన వారిపై జిల్లా యంత్రాంగం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 5 వేల వరకు జరిమానా విధించనుంది.

గత కొద్ది రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) చాలా దారుణంగా కొనసాగుతోంది. మంగళవారం నాటికి కొంత మెరుగుదల కనిపించినప్పటికీ AQI 291 వద్దా దారుణంగానే ఉందని తేలింది. అయితే బుధవారం ఉదయం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ఆందోళనకరంగానే ఉన్నాయి.

►ALSO READ | H-1B, H-4 వీసాదారులకు కొత్త చిక్కులు: వీసా ఇంటర్వ్యూలు రద్దు.. ఎందుకంటే..?

తందూర్‌లపై నిషేధం ఎందుకు..?
తందూర్‌లపై నిషేధాన్ని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ అధికారులు సమర్థించారు. ఎయిర్ (నివారణ మరియు కాలుష్య నియంత్రణ) చట్టం, 1981, సెక్షన్ 31(ఏ) ప్రకారం ఈ నిషేధం విధించబడింది. బొగ్గు ఆధారిత వంటకాలు స్థానికంగా కాలుష్యాన్ని పెంచడంలో పెద్ద పాత్ర పోషిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యలు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌లో భాగం. దీనిపై నగరంలో తనిఖీలు నిర్వహించి, హోటళ్లు.. ఇతర ఆహార కేంద్రాలు తక్షణమే బొగ్గు, కట్టెల వాడకాన్ని ఆపేలా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి.