ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కొత్త ఇమ్మిగ్రేషన్ నిర్ణయాల వల్ల అమెరికా వెళ్లాలనుకునే వేలాది మంది H-1B వీసాదారులు, వారిపై ఆధారపడిన H-4 వీసా దరఖాస్తుదారులకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. డిసెంబర్ 15 నుంచి తప్పనిసరిగా అమలులోకి రానున్న "సోషల్ మీడియా స్క్రీనింగ్" రూల్స్ కారణంగా డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకు షెడ్యూల్ చేయబడిన వీసా ఇంటర్వ్యూలు భారీగా రద్దు చేయబడ్డాయి. దీంతో హైదరాబాద్, చెన్నైతో సహా ఇండియాలోని ఇతర US కాన్సులేట్లలో ఇంటర్వ్యూ స్లాట్‌లు రద్దు చేయబడ్డాయి. దీంతో దరఖాస్తులను కొన్ని నెలలపాటు వాయిదా వేశారు. అనేక చోట్ల యూఎస్ వీసా అపాయింట్‌మెంట్‌లు 2026 మార్చి నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి.
కొత్త ఉద్యోగాల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నవారు, పెళ్లిళ్లు లేదా తల్లిదండ్రులను భారత్‌లో దించేందుకు షార్ట్ డ్యూరేషన్ ట్రావెల్ కోసం వచ్చి స్టాంపింగ్ అవసరం ఉన్నవారు ఇప్పుడు కొత్త నిబంధనల కారణంగా ఇరుక్కుపోయారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ కొత్తగా ప్రకటించిన ఈ విధానం వల్ల H-1B ఉద్యోగులు.. వారిపై ఆధారపడిన H-4 ఫ్యామిలీ మెంబర్స్ డిసెంబర్ 15 నుంచి తప్పనిసరిగా సోషల్ మీడియా పరిశీలన కోసం తమ అకౌంట్లను "పబ్లిక్" చేయాల్సి ఉంటుంది. అందువల్ల కొత్త స్క్రీనింగ్ ప్రక్రియ కారణంగా కాన్సులేట్లు ప్రతిరోజూ ఇంటర్వ్యూ చేసే దరఖాస్తుదారుల సంఖ్యను తగ్గించుకోవాలని యోచిస్తున్నాయని వెల్లడైంది.
►ALSO READ | ఇండియాలో ఏడాదికి రూ.1.80 లక్షల కోట్ల IPO లు సాధారణమే
తాజా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అత్యవసరమైతే తప్ప అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని ఇమ్మిగ్రేషన్ న్యాయ సంస్థలు అమెరికాలోని విదేశీ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా పోస్ట్‌ల ఆధారంగా ఇప్పటికే USలో ఉన్నవారి వీసాలు రద్దు అయిన కేసులు కూడా పెరుగుతున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు. H-1B, H-4 వీసాదారులకు అధికారికంగా "ఫ్రీజ్" ప్రకటించనప్పటికీ.. ఇంటర్వ్యూ స్లాట్‌లను చాలా నెలలు వాయిదా వేయడం వల్ల కలిగే ప్రభావం ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీనికి ముందు విద్యార్థి వీసాలపై కూడా పాస్ చేసి దానిని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.

